పిఠాపురం: కాకినాడ సెజ్ భూములను రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తే  కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నాడని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్  ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై విమర్శలు గుప్పించారు.

ప్రజా సంకల్పయాత్రలో భాగంగా  వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన  సభలో వైఎస్ జగన్  పాల్గొన్నారు.  ఎన్నికల ముందు కాకినాడ సెజ్ భూములు  వైఎస్ జగన్ ‌ భూములుగా పేర్కొన్నారన్నారు. అధికారంలోకి వస్తే ఈ భూములను రైతులకు ఇవ్వనున్నట్టు  ప్రచారం చేశారని  జగన్ గుర్తు చేశారు.

చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కాకినాడ సెజ్ భూములను ఎందుకు తిరిగి తీసుకోలేదో చెప్పాలని జగన్  ప్రశ్నించారు. ఈ భూములను ఇవ్వాలని డిమాండ్ చేసిన రైతులపై కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారని  జగన్  ఆరోపించారు.  ఎన్నికల ముందు ఓ మాట అధికారంలోకి వచ్చిన తర్వాత మరో మాట మాట్లాడే నైజం  చంద్రబాబునాయుడుకు ఉందన్నారు.  

ఎన్నికల ముందు ఇచ్చిన  హమీలను  అమలు చేయలేని దుస్థితి  నెలకొందన్నారు.  వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న కాలంలో ప్రారంభించిన ప్రాజెక్టులు పూర్తి కావడం లేదన్నారు.  పిఠాపురంలో అరాచకం రాజ్యమేలుతోందన్నారు. బదిలీలు కావాలంటే  లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు.  లంచాలు ఇవ్వలేక ఈ ప్రాంతంలో ఓ ఎంఈఓ గుండెపోటుతో  మృతి చెందాడని జగన్  ఆరోపించారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి అమలు చేయకపోవడం మోసం కాదా అని జగన్ ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ఎందుకు నెరవేర్చలేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాపులను మోసం చేసింది చంద్రబాబునాయుడు కాదా అని బాబును ప్రశ్నించారు

కాపులను అణచివేస్తే తాము అండగా ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాపుల ఉద్యమం తీవ్రతరమైన సమయంలో కాపుల కోసం కమిషన్ వేసినట్టు చెప్పారు.కాపులకు ఐదేళ్లలో ఐదు వేల కోట్లు  ఇస్తామని హమీ ఇచ్చి మోసం చేయలేదా అని ఆయన ప్రశ్నించారు.

కాపు కమిషన్ ఛైర్మెన్ సంతకం లేకుండానే అసెంబ్లీలోనే తీర్మానం ప్రవేశపెట్టినట్టు చెప్పారు. కాపుల రిజర్వేషన్ల విషయంలో యూ టర్న్ తీసుకొంది చంద్రబాబునాయుడు మాత్రమేనని ఆయన చెప్పారు. కాపుల రిజర్వేషన్ల విషయంలో చిత్తశుద్ధితో సలహాలు ఇస్తే వాటిని స్వీకరించనున్నట్టు ఆయన చెప్పారు. కానీ, కాపుల రిజర్వేషన్ల విషయంలో తనను తప్పుబట్టడం సరైందా అని జగన్ ప్రశ్నించారు.

కాపుల రిజర్వేషన్ల విషయంలో చంద్రబాబునాయుడు మాదిరిగా తాను మోసం చేయలేనని తాను ప్రకటిస్తే తాను యూ టర్న్ తీసుకొన్నానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని  జగన్ విమర్శించారు. కానీ, కాపులకు ఐదువేల కోట్లు ఇస్తామని ప్రకటించి కేవలం 1340 కోట్లు మాత్రమే ఇచ్చారని ఆయన చెప్పారు. కానీ, కాపుల కోసం తాము 10 వేల కోట్లు ఇస్తామని జగన్ ప్రకటించారు.

యూ టర్న్ తీసుకోవడం మా ఇంటా వంటా లేదన్నారు. కాపు రిజర్వేషన్ తాము మద్దతిస్తామని చెప్పారు. కాపు రిజర్వేషన్ పై తమ అభిప్రాయం ఒక్కటేనని ఆయన గుర్తు చేశారు..కులాల విషయంలో నా చేతుల్లో కొన్ని ఉంటాయి.. కొన్ని తన చేతిలో ఉండవన్నారు. ఈ రకంగా నమ్మించే ప్రయత్నం చేస్తే నమ్మకూడదని ఆయన ప్రజలను కోరారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో బీసీ ల రిజర్వేషన్ల కోసం ఉద్యమాలు సాగుతున్నాయన్నారు. కాపుల రిజర్వేషన్ల విషయమై తన మాటలను వక్రీకరించారని ఆయన చెప్పారు. రిజర్వేషన్లు 50 శాతం దాటడానికి వీల్లేదని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్న విషయం తెలిసి కూడ బాబు ఆరుమాసాల్లోనే కాపులకు రిజర్వేషన్లను కల్పిస్తామని చెప్పి మోసం చేశారన్నారు. 

 

ఈ వార్త చదవండి:కాపు రిజర్వేషన్లపై జగన్ మాట మార్చారు: చంద్రబాబు

కాపు రిజర్వేషన్లు: రాజ్యాంగ సవరణపై కేంద్రం స్పష్టత ఇవ్వాలి: యనమల