ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన లండన్ పర్యటనను రద్దు చేసుకున్నారు. టీఆర్ఎస్‌తో వైఎస్సార్ కాంగ్రెస్ పొత్తు, తలసాని ఏపీ పర్యటన, వైఎస్ షర్మిల ఫిర్యాదు వంటి పరిణామాలతో రాజకీయాలు అనూహ్యంగా మారిపోయాయి.

ఎన్నికలకు కొద్ది నెలల ముందే రెండు ప్రధాన పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ తన పర్యటనను రద్దు చేసుకున్నట్లుగా వైసీపీ ఒక ప్రకటనలో తెలిపింది. వాస్తవానికి ఇవాళ సాయంత్రం జగన్ హైదరాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సి ఉంది.

లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చదువుకుంటున్న కుమార్తెతో గడిపి ఈ నెల 22న తిరిగి హైదరాబాద్ రావాలన్నది జగన్ షెడ్యూల్. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా తన దావోస్ పర్యటను రద్దు చేసుకున్నారు. ఆయన స్థానంలో మంత్రి నారా లోకేశ్ దావోస్ పర్యటనకు వెళతారు.