సత్తెనపల్లి నియోజకవర్గంలో గత రాత్రి వైసిపి, జనసేన శ్రేణులు ఘర్షనకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
సత్తెనపల్లి : అధికార వైసిపి, ప్రతిపక్ష జనసేన పార్టీ నాయకులు బాహాబాహీకి దిగడంతో పల్నాడు జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. 'ఇంటింటికి పవనన్న ప్రజాబాట' కార్యక్రమంలో భాగంగా సత్తెనపల్లి నియోజకవర్గంలోని నకరికల్లు మండలం కొంకలగుంట గ్రామం పాపిశెట్టిపాలెంలో జనసేన నాయకులు పర్యటించారు. అయితే వీరిని అడ్డుకునేందుకు వైసిపి నాయకులు ప్రయత్నించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. జనసేన నాయకుల వాహనాలు ముందుకు వెళ్లనివ్వకుండా వైసిపి నాయకులు అడ్డుకోవడంతొ ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
వైసిపి, జనసేన పార్టీ నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పోలీసులు రంగప్రవేశం చేసారు. ఇరువర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినకపోవడంతో చెదరగొట్టారు. దీంతో ఇరు పార్టీల నాయకులు అక్కడినుండి వెళ్లిపోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
వీడియో
అయితే ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వెళుతున్న తమ పార్టీ నాయకులను అడ్డుకోవడాన్ని నిరసిస్తూ సత్తెనపల్లి జనసేన 'ఛలో నకరికల్లు' కు పిలుపునిచ్చింది. దీంతో ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకుండా పోలీసులు ముందస్తుగానే జనసేన నాయకులకు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. వైసిపి నాయకులు కూడా జనసేన నాయకులు మళ్లీ తమప్రాంతంలో అడుగుపెట్టినా అడ్డుకోడానికి సిద్దమవుతున్నారు. దీంతో సత్తెనపల్లి నియోజకవర్గ పోలీసులు ఎలాంటి ఘర్షణలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Read More Guntur : ఆధునిక యుగంలో ఆటవిక తీర్పు... దళిత కుటుంబాన్ని వెలివేసిన పెద్దలు (వీడియో)
పాపిశెట్టిపాలెంలో ప్రజల సమస్యలు తెలుసుకోడానికి వెళితే వైసిపి నాయకులు కరెంట్ తీసేసి మరీ దాడికి యత్నించారని జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు. తమ వాహనాలకు వారి వాహనాలను అడ్డంపెట్టి దౌర్జన్యం చేసారన్నారు. పాపిశెట్టిపాలెంకు చెందిన ఓ మహిళ ఇంటికి ఏకంగా రూ.50వేల కరెంట్ బిల్లు వచ్చిందని... ఆ మొత్తాన్ని కట్టాలని విద్యుత్ శాఖ సిబ్బంది ఒత్తిడి తేస్తున్నారంటే పరిస్థితి ఎలా వుందో అర్ధం చేసుకోవచ్చని అన్నారు. ఇలాంటి సమస్యల గురించి తెలిసే గ్రామానికి వెళుతుండగా ఎక్కడ తమ అరాచక పాలన గురించి బయటపడుతుందోనని వైసిపి నాయకులు దాడులకు దిగారని జనసేన నాయకులు అంటున్నారు.
స్థానిక ఎమ్మెల్యే, నీటిపారుదల మంత్రి అంబటి రాంబాబు ఆదేశాలతోనే వైసిపి నాయకులు ఇతర పార్టీల నాయకులపై దాడులకు తెగబడుతున్నారని జనసేన ఆరోపిస్తోంది. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో వుండి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వ్యవహరించకూడదని అంబటిని హెచ్చరిస్తున్నారు జనసేన నాయకులు.
