ఇళ్ల పట్టాల పంపిణీని పురస్కరించుకుని అధికార వైసీపీలో నేతల మధ్య వున్న విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. తమకు అన్యాయం జరిగిందంటూ వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి దృష్టికి ఈ విషయం తీసుకెళ్లారు. 

అటు ప్రకాశం జిల్లా చీరాల వైసీపీలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. ఈసారి ఎమ్మెల్యే కరణం బలరాం వర్సెస్ మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీత వర్గాలు వాగ్వాదానికి దిగాయి.

వేటపాలెం మండలం బచ్చులవారిపాలెంలో ఇళ్ల పట్టాల పంపిణీ సందర్భంగా ఇరువురు నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. ఇళ్ల పట్టాల పంపిణీకి సభ ఏర్పాటు చేసినా బయటే పట్టాలు పంపిణీ చేసి ఎమ్మెల్యే కరణం బలరాం వెళ్లి పోయారు.

దీంతో పోతుల సునీత అవాక్కయ్యారు. అంతేకాకుండా సభా వేదికపై ఉన్న పోతుల సునీతని కరణం పట్టించుకోకుండా వెళ్లిపోయారు. దీంతో బలరాం తీరుపై పోతుల సునీత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.