అవసరం ఏముంది.. : మోదీ సర్కార్‌పై విపక్షాల అవిశ్వాస తీర్మానంపై విజయసాయిరెడ్డి
కేంద్ర ప్రభుత్వంపై లోక్‌సభలో విపక్షాలు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని వెల్లడించింది.

కేంద్ర ప్రభుత్వంపై లోక్‌సభలో విపక్షాలు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని వెల్లడించింది. వైసీపీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాల్సిన అవసరం లేదని అన్నారు. అవిశ్వాస తీర్మానాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తుందని చెప్పారు. ‘‘అంతా సవ్యంగా సాగుతున్నప్పుడు అవిశ్వాస తీర్మానం అవసరం ఎక్కడిది?. మేము ఆ తీర్మానాన్ని వ్యతిరేకించబోతున్నాం’’ ఆయన విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఇక, వైసీపీకి సంఖ్యాపరంగా లోక్‌సభలో 22 మంది సభ్యులు ఉన్నారు. అందులో ఒక్క రఘురామకృష్ణరాజు పార్టీకి రెబల్‌గా మారారు.
ఇదిలా ఉంటే, కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతించారు. లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ మంగళవారం అవిశ్వాస తీర్మాన నోటీసు ఇచ్చారు. అయితే దీనిని అనుమతిస్తున్నట్టుగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. ‘‘నేను అన్ని పార్టీల నాయకులతో చర్చించి.. దీనిని చర్చకు తీసుకోవడానికి తగిన సమయాన్ని మీకు తెలియజేస్తాను’’ అని ఓం బిర్లా లోక్‌సభలో ప్రకటన చేశారు. ఆ తర్వాత మణిపూర్‌పై చర్చ జరిగే సమయంలో ప్రధాని మోదీ సభకు హాజరుకావాలని కోరుతూ ప్రతిపక్ష ఎంపీల నినాదాలు చేయడంతో లోక్‌సభమధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను మణిపూర్ అంశం కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. మణిపుర్ అంశంపై పార్లమెంటులో ప్రధాని మోదీ సమగ్ర ప్రకటన చేయాలని విపక్ష కూటమి ‘‘ఇండియా’’ పట్టుబుడుతుంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తీసుకురావాలని విపక్ష కూటమి భావించింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఎంపీ ఈరోజు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు. మణిపూర్‌లో జరిగిన హింసాకాండతో సహా పలు అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ నుంచి సమాధానం కోరేందుకు లోక్‌సభలో అధికార పార్టీకి సంఖ్యాబలం ఎక్కువగా ఉన్నప్పటికీ అవిశ్వాస తీర్మానం ఒక మార్గమని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. ఇదిలా ఉంటే, ‘‘I.N.D.I.A’’ కూటమిలో భాగంగా లేని విపక్ష పార్టీ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కూడా సెపరేటుగా అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది. మణిపూర్ అంశంపై కేంద్ర విధానాలు సరిగా లేవని బీఆర్ఎస్ ఆరోపించింది.