న్యూఢిల్లీ: వైసీపీ ఎంపీలు తమతో టచ్ లో ఉన్నారంటూ బీజేపీ ఎంపీ సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీలు నిప్పులు చెరిగారు. దమ్ముంటే మీతో టచ్ లో ఉన్న ఒక్క ఎంపీ పేరు చెప్పాలని సవాల్ విసిరారు. వైసీపీ ఎంపీలపై నీలాపనిందలు వేసి పబ్బం గడుపుకోవాలని ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. 

టీడీపీ వేసే బిస్కెట్లకు కక్కుర్తి పడి తమపై నిందలు వేస్తే చూస్తూ ఊరుకోబోమని తగిన బుద్ది చెప్తామని హెచ్చరించారు. సుజనా చౌదరి ఎంగిలి మెతుకులపై ఆధారపడి బతికే వ్యక్తి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

బ్యాంక్ లకు డబ్బులు ఎగ్గొట్టిన సుజనా చౌదరి తమపై నిందలు వేయడంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గూగుల్ లో దొంగ అని టైప్ చేస్తే సుజనాచౌదరి పేరు వస్తుంది అంటూ స్పష్టం చేశారు. 

సుజనా చౌదరి బీజేపీలో ఉంటూ టీడీపీకి ఏజెంట్ గా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. సుజనా చౌదరి టీడీపీలో ఉన్నారా, లేక బీజేపీలో ఉన్నారా అన్నది తేల్చుకోవాలన్నారు. సుజనా చౌదరిలా తాము బ్యాంకులకు కన్నం వేయలేదని తీవ్ర వ్యాక్యలు చేశారు. చంద్రబాబు నాయుడు వేసే ఎంగిలిమెతుకులకు అలవాటు పడి తమపై నిందలు వేస్తే సహించేది లేదన్నారు. 

సుజనా చౌదరి అంటే బ్యాంక్ దొంగ అని అందరికీ తెలుసునన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సుజనా చౌదరి ఢిల్లీలో ఉంటూ రాష్ట్రాన్ని దోచుకున్నారని మండిపడ్డారు. ఏపీలో టీడీపీ ఇసుకను అమ్ముకుంటూ బతికిందన్నారు. 

సుజనా చౌదరి బీజేపీలో ఉంటూ ఏపీలో టీడీపీని బతికించేందుకు ప్రయత్నిస్తున్నారేమో అది సాధ్యం కాదన్నారు. ఏపీలో టీడీపీ ఎప్పుడో చచ్చిపోయిందన్నారు. గత ఎన్నికల్లో ప్రజలు తీర్పుతో చావు తప్పి కన్నులొట్టబోయిందన్నారు. 

అనేక బ్యాంకులకు కన్నం వేసి దొరుకుపోతామన్న భయంతో బీజేపీలో చేరిపోయారంటూ ఆరోపించారు. సుజనా చౌదరికి దమ్ముంటే బ్యాంకులకు చెల్లించాల్సిన సుమారు రూ.8వేల కోట్లు చెల్లించి మాట్లాడాలని సవాల్ విసిరారు. ఇప్పటికైనా సుజనా చౌదరి తన వైఖరి మార్చుకోవాలని లేని పక్షంలో తాము తలచుకుంటే ఏమౌతారో ఊహించుకోవాలని వైసీపీ ఎంపీలు ఘాటుగా హెచ్చరించారు.    

ఈ వార్తలు కూడా చదవండి

20 మంది టీడీపీ, వైసీపీ ప్రజాప్రతినిధులు టచ్‌లో: సుజనా సంచలనం