ప్రకాశం: ఎన్నికల సమరానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడీ అవుతుంది. ఇప్పటికీ ప్రజా సంకల్ప యాత్ర పేరుతో జగన్ చేస్తున్న పాదయాత్రకు ప్రజల నుంచి విశేష ఆదరణ వస్తోంది. దీంతో మంచి జోష్ మీద ఉన్న వైసీపీ శ్రేణులు ప్రజల్లోకి మరింత చొచ్చుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. 

మరోవైపు జగన్ అభ్యర్థుల గెలుపోటములు, అనుకూలతలు, ప్రతికూలతలపై సర్వేలు మీద సర్వేలు చేయిస్తున్నారు. ఇటీవలే వైఎస్ జగన్ కు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత కిషోర్ టీం నుంచి సర్వే రిపోర్ట్ లు అందాయి. 

రిపోర్ట్ లను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన జగన్ ఆయా నియోజకవర్గాల సమన్వయ కర్తలకు దిశానిర్దేశం చేశారు. కొందరికి తీరుమార్చుకోకపోతే మార్చేస్తా అంటూ వార్నింగ్ లు సైతం ఇచ్చారు. అలాగే కాస్త అటూ ఇటూ ఉన్నవాళ్లకి ఎలా వెళ్లాలి ప్రజలను ఎలా ఆకట్టుకోవాలి అనే అంశాలపై క్లాస్ తీసుకున్నారు.

గత ఎన్నికల్లో చేసిన పొరపాట్లు మళ్లీ పునరావృతం కాకుండా ఉండేందుకు వైఎస్ జగన్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఎన్నిక‌లు స‌మ‌రానికి కేవ‌లం నాలుగు నెల‌లు మాత్ర‌మే స‌మ‌యం ఉన్న నేప‌థ్యంలో జగన్ అప్రమత్తమవుతున్నారు. 

అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు మ‌రోసారి అధికారంలోకి రావాల‌ని ఎత్తుల‌కు పై ఎత్తులు వేస్తుంటే మ‌రోవైపు ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాల‌నే ఉద్దేశంతో త‌మ ఆలోచ‌న‌ల‌కు ప‌దును పెడుతోంది. 
 
ఈ నేపథ్యంలో పార్టీ అధినేత జ‌గ‌న్ ఆచితూచి అడుగులు వేస్తూ ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలుపుగుర్రాల జాబితాను తయారు చేస్తున్నారు. అయితే ప్రకాశం జిల్లాకు చెందిన నలుగురు కీలక నేతలకు టిక్కెట్లు కన్ఫమ్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే వైఎస్ జగన్ ఆ నలుగురికి గ్రీన్ సిగ్నల్స్ ఇచ్చేశారని ఇక అభ్యర్థులు దూసుకుపోవడమే లేటని చర్చ జరుగుతుంది. 

ప్ర‌కాశం జిల్లాకు చెందిన మానుగుంట మహిధర్ రెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, బెర్ర మధుసూదన్, ఆదిమూలపు సురేష్ లకు టిక్కెట్లు కన్ఫమ్ చేసేశారని ప్రచారం జరుగుతోంది. మానుగుంట మ‌హిధ‌ర్ రెడ్డికి  కందుకూరు, బాలినేని శ్రీనివాసరెడ్డికి ఒంగోలు, బెర్ర‌ మ‌ధుసూద‌న్ కి క‌నిగిరి, ఆదిమూల‌పు సురేష్ కి ఎర్ర‌గొండ‌పాలెం కన్ఫమ్ చేసినట్లు తెలుస్తోంది.
 
ఈ నలుగురు అభ్యర్థులకు 2019 ఎన్నికల్లో టిక్కెట్లు కన్ఫమ్ అని అందులో ఎలాంటి మార్పులు ఉండవని జగన్ తేల్చి చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే విజయనగరం నియోజకవర్గం టిక్కెట్ ను ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామికి ఖరారు చేశారు. వీరితోపాటు గిద్ద‌లూరు నుంచి అన్నా రాంబాబుకు కూడా దాదాపుగా టిక్కెట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. 

గత ఎన్నిక‌ల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున గెలిచిన ముత్తుముల అశోక్ రెడ్డి టీడీపీలో చేరిపోవడంతో మళ్లీ అశోక్ రెడ్డి గెలవకుండా ఉండేందుకు జ‌గ‌న్ ప‌క‌డ్బందీగా ప్లాన్ వేస్తున్నారట. ఈ నేపథ్యంలో గెలుపు గుర్రాలనే బరిలో దింపాలనే ఉద్దేశంతో అన్నా రాంబాబును బరిలోకి దింపనున్నట్లు తెలుస్తుంది. 
 
ఇకపోతే 2019 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేల‌ను ఓడించి వారికి రాజ‌కీయ విలువ‌ల‌ను రుచి చూపించాల‌ని జ‌గ‌న్ ఆలోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అంతేకాదు జగన్ కు ప్రకాశం జిల్లాతో ప్రత్యేకమైన అనుబంధం ఉందని అందుకే జిల్లా రాజకీయాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తోంది.