తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీలో పదవుల పందేరానికి తెరలేపింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీకి సంబంధించి ఎలాంటి పదవులను భర్తీ చేయలేదు. అలాగని ఎవరికీ పదవులను సైతం కట్టబెట్టలేదు. 

అయితే పార్టీ పదవులపై నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో శనివారం పదవుల పందేరానికి తెరలేపారు పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్ చార్జ్, పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి. 

30మంది సభ్యులతో కూడిన అధికార ప్రతినిధుల జాబితాను విడుదల చేశారు. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు 30 మందికి అధికార ప్రతినిధుల పదవిని కట్టబెట్టారు. ఇప్పటి వరకు ఉన్న అధికార ప్రతినిధులను రద్దు చేస్తూ వారి స్థానంలో కొత్తవారిని నియమించారు.  

కొత్తగా విడుదల చేసిన పార్టీ అధికార ప్రతినిధుల జాబితాలో 20 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీకి అవకాశం కల్పించారు.  వీరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఇతర వర్గాలకు భారీ సంఖ్యలో చోటు కల్పించారు. 

ఈ పదవుల్లో అత్యధికంగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు పెద్ద ఎత్తున అవకాశం కల్పించగా ఉభయగోదావరి జిల్లాల నుంచి ఒక్కొక్కరికి అవకాశం కల్పించారు. త్వరలోనే కేంద్రపాలక సభ్యుల జాబితాను కూడా విడుదల చేయనున్నారు.