కడప: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును విచారిస్తున్న సీబీఐ అధికారుల్లో ఒకరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో మిగతా సిబీఐ అధికారులు కూడా కరోనా పరీక్షలు చేయించుకోవడానికి సిద్ధపడ్డారు. కడప కేంద్ర కారాగారం కేంద్రంగా సీబీఐ అధికారులు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై దర్యాప్తు సాగిస్తున్నారు. 

వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు గత కొద్ది రోజులుగా పలువురిని విచారిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ సిబిఐ అధికారికి కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తోంది. దీంతో సిిబఐ బృందంలో కలకలం చెలరేగింది.

ఇదిలావుండగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో కరోనా పంజా విసిరింది. గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి మండలం భట్లూరులో ఓ ట్యూషన్ టీచర్ కు కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. టీచర్ తో పాటు 14 మంది విద్యార్థులకు కరోనా పాజిటి వచ్చింది.

విద్యార్థులంతా ఏడేళ్ల లోపు వయస్సు గలవారే. విద్యార్థుల తల్లిదండ్రుల్లో కొంత మందికి కూడా కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తోంది. దీంతో పిల్లలను ఎన్నారై ఆస్పత్రి క్వారంటైన్ సెంటర్ కు తరలించారు. గ్రామంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతికి అడ్డుకట్ట పడడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గురువారంనాటి లెక్కల ప్రకారం... కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఏడు లక్షల 235కి చేరుకుంది. కరోనా వైరస్ కారణంగా 5,869 మంది మృత్యువాత పడ్డారు.