కడప: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో లభించిన లేఖ ఇప్పుడు కలకలం రేపుతోంది. లేఖలో డ్రైవర్ ప్రసాద్ పేరు ప్రస్తావించడంతో అతనిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సిట్ దర్యాప్తు సంస్థ ప్రసాద్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. 

మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని తన కుమారుడు హత్య చేశారంటూ వస్తున్న వార్తలు కేవలం కుట్రపూరితమేనని వైఎస్ వివేకానంద డ్రైవర్ ప్రసాద్ తల్లి స్పష్టం చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి తమకుటుంబానికి ఎంతో సేవ చేశారని అలాంటి వ్యక్తిని తమ కుమారుడు ఎందుకు చంపుతాడంటూ చెప్పుకొచ్చారు. 

తమ కుమారుడు ప్రసాద్ ఒక వ్యక్తి ప్రాణాలు తీసే వ్యక్తి కాదన్నారు. అయితే తనను డ్రైవర్ చంపేస్తున్నాడంటూ లేఖ ప్రత్యక్షమవ్వడంపై ఆమె పలు అనుమానాలు వ్యక్తం చేశారు. తమ కుమారుడు పేరు టీవీలలో వస్తుంటే తమకు ఆందోళన కలుగుతోందని తమ కుమారుడు ఎక్కడ ఉన్నాడో తెలియడం లేదని ఆమె బోరున విలపించారు.

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు ముందు రోజు తన భర్త ప్రసాద్ డ్యూటీ నిమిత్తం ఉదయం 5.30 గంటలకు వైఎస్ వివేకానందరెడ్డి ఇంటికి వెళ్లారని రాత్రి 11.30గంటలకు తిరిగి వచ్చారని చెప్పారు. ఒక వ్యక్తిని కొట్టేటంత కోపం తన భర్తకు లేదన్నారు రూప. 

వైఎస్ వివేకానందరెడ్డి దగ్గర తన భర్త చాలా కాలం నుంచి పని చేస్తున్నామని, గతంలో హైదరాబాద్ లో ఉండేవాళ్లమని ఆ తర్వాత రెండేళ్లుగా పులివెందులలోనే ఉంటున్నట్లు తెలిపారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురైన విషయం వైఎస్ వివేకానందరెడ్డి అల్లుడు ఫోన్ చేసి చెప్పే వరకు తెలియదన్నారు. 

వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారన్న విషయం వివేకానంద అల్లుడే చెప్పారే తప్ప అప్పటి వరకు తన భర్త అక్కడికి వెళ్లలేదన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి తమ కుటుంబానికి ఎంతో ఆర్థిక సాయం చేశారని అలాంటి వ్యక్తిని పొట్టనబెట్టుకునే మనస్తత్వం తన భర్తది కాదన్నారు ప్రసాద్ భార్య రూప.