వైఎస్ వివేకానందరెడ్డి  హత్య  కేసులో   కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని  సీబీఐ టార్గెట్  చేసినట్టుగా అనిపిస్తుందని  వివేకా సోదరి  విమలారెడ్డి  చెప్పారు. 


కర్నూల్: వైఎస్ వివేకానందరెడ్డిని చంపిన వారు బయట తిరుగుతున్నారని ఆయన సోదరి విమలా రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.కర్నూల్ లో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తల్లి వైఎస్ శ్రీలక్ష్మిని విమలారెడ్డి బుధవారంనాడు పరామర్శించారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. 

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని టార్గెట్ చేశారని అనిపిస్తుందన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో తనకు సంబంధం లేదని అవినాష్ రెడ్డి ఇవాళ తనకు చెప్పారన్నారు. ఏదైనా తప్పు చేసిన వారు అబద్దాలు చెబితే ముఖంలో స్పష్టంగా తెలుస్తుందన్నారు. ఈ విషయంలో తాను వైఎస్ అవినాష్ రెడ్డిని నమ్ముతున్నట్టుగా ఆమె చెప్పారు. ఈ కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి బయటపడుతాడనే నమ్మకం ఉందన్నారు. 

also read:వైఎస్ అవినాష్ రెడ్డికి ఊరట: ఈ నెల 25న తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్‌కు వెళ్లాలని సుప్రీం ఆదేశం

వైఎస్ అవినాష్ రెడ్డి విషయంలో రుజువుల కోసం సీబీఐ అధికారులు ప్రయత్నిస్తున్నారన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యతో కుటుంబానికి సంబంధం లేదని తొలుత సునీతా రెడ్డి తమతో చెప్పారన్నారు. కానీ ఇప్పుడేమో మాటమార్చారన్నారు. వైఎస్ సునీతారెడ్డి వెనుక దుష్ట శక్తుల ప్రభావం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. ఇలా చేయవద్దని తాము మందలించినందుకు వైఎస్ సునీతా రెడ్డి తమతో మాట్లాడడం లేదని విమలా రెడ్డి గుర్తు చేసుకున్నారు.