నేటి విచారణకు బ్రేక్, రేపు విచారణకు రావాలి:వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీస్
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని రేపు విచారిస్తామని సీబీఐ తెలంగాణ హైకోర్టుకు తెలిపింది. రేపు విచారణకు రావాలని అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది సీబీఐ
హైదరాబాద్: కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని బుధవారంనాడు విచారణకు రావాలని సీబీఐ కోరింది. మంగళవారంనాడు తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పై విచారణ సాగుతున్న నేపథ్యంలో రేపు విచారణకు రావాలని సీబీఐ అవినాష్ రెడ్డిని కోరింది. నిన్న కూడా వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ విచారించలేదు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఈ నెల 17న మధ్యాహ్నం మూడు గంంటలకు విచారణకు రావాలని వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ నోటీసులు జారీ చేసింది.అయితే నిన్న ఉదయమే తెలంగాణ హైకోర్టులో వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై నిన్న మధ్యాహ్నం విచారణ ప్రారంభమైంది. అదే సమయంలో వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు.
అయితే ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరుగుతున్న సమయంలోనే వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ విచారణకు రావాలని సీబీఐ కోరిన విషయాన్ని అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది కోరారు. అయితే సాయంత్రం ఐదు గంటల తర్వాత విచారిస్తామని సీబీఐ తరపు న్యాయవాది తొలుత కోర్టుకు తెలిపారు. అయితే కోర్టులోనే ఇన్వెస్టిగేషన్ అధికారి ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో నిన్న విచారణను వాయిదా వేసుకుంది సీబీఐ, ఇవాళ ఉదయం పదిన్నర గంటలకు విచారణకు రావాలని సీబీఐ నోటీసులు జారీ చేసింది. సీబీఐ కార్యాలయానికి చేరుకున్న వైఎస్ అవినాష్ రెడ్డి ఈ నోటీసులు అందుకొని ఇంటికి వెళ్లిపోయారు.
వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై నిన్న విచారణ సందర్భంగా హైకోర్టు సీబీఐకి కీలక సూచనలు చేసింది. ఈ నెల 18వ తేదీ నాలుగు గంటల తర్వాత వైఎస్ అవినాష్ రెడ్డిని విచారించాలని హైకోర్టు సూచించింది. హైకోర్టు సూచనతో ఇవాళ ఉదయం బదులు సాయంత్రం నాలుగు గంటలకు విచారణకు రావాలని వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ కోరింది.
also read:'వివేకా హత్యలో అవినాష్ రెడ్డి ప్రమేయం': ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ మధ్యాహ్ననికి వాయిదా
ఇవాళ మధ్యాహ్నం 1 గంట నుండి వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై వాడీ వేడీగా వాదనలు సాగాయి. ఈ సమయంలో వైఎస్ అవినాష్ రెడ్డిని ఇవాళ నాలుగు గంటలకు సీబీఐ విచారించనుందని హైకోర్టుకు తెలిపారు. అయితే సీబీఐ ఇన్వెస్టిగేషన్ అధికారి కోర్టులో ఉన్నందున ఎవరు విచారిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. అయితే వైఎస్ అవినాష్ రెడ్డిని రేపు విచారిస్తామని సీబీఐ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ఈ మేరకు వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేస్తున్నట్టుగా తెలిపింది.
ముందస్తు బెయిల్ పిటిషన్ కారణంగా వైఎస్ అవినాష్ రెడ్డిని నిన్నటి నుండి సీబీఐ విచారించలేదు. ముందస్తు బెయిల్ పై హైకోర్టు తీర్పు ఇవాళ వెలువడే అవకాశం ఉంది. దీంతో రేపు వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ విచారించనుంది.