'వివేకా హత్యలో అవినాష్ రెడ్డి ప్రమేయం': ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ మధ్యాహ్ననికి వాయిదా
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను ఇవాళ మధ్యాహ్నానికి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు.
హైదరాబాద్: కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను తెలంగాణ హైకోర్టు మంగళవారంనాడు మధ్యాహ్నానికి వాయిదా వేసింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పాత్ర ఉందని సీబీఐ ఆరోపణలు చేసింది. ఇప్పటి వరకు వైఎస్ అవినాష్ రెడ్డిని నాలుగు సార్లు విచారించినట్టుగా సీబీఐ తరపు న్యాయవాది చెప్పారు.
వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయారని చిత్రీకరించారని సీబీఐ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజున అవినాష్ రెడ్డి ఇంట్లోనే ఉన్నారని సీబీఐ తెలిపింది. వివేకానందరెడ్డిపై దాడి చేసిన తర్వాత సునీల్ యాదవ్ వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్లిపోయారని సీబీఐ న్యాయవాది తెలిపారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజున వైఎస్ అవినాష్ రెడ్డి ఫోన్ యాక్టివిటీస్ కీలకంగా ఉన్నాయని సీబీఐ తెలిపింది.
వివేకానందరెడ్డి హత్యకు రూ. 40 కోట్ల లావాదేవీలపై విచారణ జరగాల్సి ఉందని సీబీఐ న్యాయవాది చెప్పారు. వివేకానందరెడ్డి హత్య వెనుక కుట్రను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నామని సీబీఐ న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. వైఎస్ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వవద్దని సీబీఐ న్యాయవాది వాదించారు. వివేకానందరెడ్డి హత్య కేసుతో వైఎస్ అవినాష్ రెడ్డికి సంబంధం ఉందని ఆధారాలున్నాయని సీబీఐ వాదించింది.వైఎస్ వివేకా నందరెడ్డిహత్య కేసు చార్జీషీట్ లోనే ఈ విషయాన్ని పేర్కొన్నట్టుగా సీబీఐ న్యాయవాది గుర్తు చేశారు.
ఇప్పటివరకు నిర్వహించిన విచారణలో అవినాష్ రెడ్డి సీబీఐకి సహకరించలేదని న్యాయవాది చెప్పారు. వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించినట్టుగా చూపించే ప్రయత్నం చేశారని సీబీఐ ఆరోపించింది. వివేకానందరెడ్డి మృతదేహనికి బ్యాండేజీలు కట్టిన విషయాన్ని సీబీఐ తరపు న్యాయవాది ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఉదయ్ కుమార్ రెడ్డి తండ్రి జయప్రకాష్ రెడ్డితో బ్యాండేజీ కట్టించారని సీబీఐ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు
also read:వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ రేపటికి వాయిదా: సీబీఐకి హైకోర్టు సూచనలు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఈ నెల 16న వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది. దీంతో ఈ నెల 19న తెలంగాణ హైకోర్టులో వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై నిన్న మధ్యాహ్నం తెలంగాణ హైకోర్టు విచారణను ప్రారంభించింది. నిన్న సాయంత్రం కోర్టు సమయం ముగియడంతో ఇవాళ విచారిస్తామని తెలిపింది. ఇవాళ మధ్యాహ్నం 1 గంటలకు ఈ పిటిషన్ పై విచారణను ప్రారంభించింది తెలంగాణ హైకోర్టు. లంచ్ బ్రేక్ వరకు విచారణ చేసింది. లంచ్ బ్రేక్ తర్వాత ఇవాళ మధ్యాహ్నం రెండున్నర గంటలకు విచారణ చేస్తామని హైకోర్టు తెలిపింది.