వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నిందితుల కుటుంబ సభ్యులతో వివేకానందరెడ్డికి అక్రమ సంబంధాలు ఉన్నాయని వైఎస్ అవినాష్ రెడ్డి తన బెయిల్ పిటిషన్‌లో ఆరోపించారు.
హైదరాబాద్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వైసీపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. మరోవైపు విచారణకు రావాల్సిందిగా అవినాష్ రెడ్డికి సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు తమ ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే బెయిల్ పిటిషన్‌లో వైఎస్ అవినాష్ రెడ్డి పలు అంశాలను ప్రస్తావించారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసులో తనను ఇరికించే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. వివేకానందరెడ్డి కూతురు సునీతకు, ఆయన రెండో భార్యకు మధ్య విభేదాలు ఉన్నాయని చెప్పారు. వివేకా కూతురు సునీత.. సీబీఐ, స్థానిక ఎమ్మెల్సీ ద్వారా ప్రతిపక్ష నేతతో కుట్ర పన్ని తనను, తన ఫ్యామిలీని దెబ్బతీయడానికి కుట్ర పన్నారని ఆరోపించారు.
నిందితుల కుటుంబ సభ్యులతో వివేకానందరెడ్డికి అక్రమ సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. ‘‘నిందితుడు సునీల్ యాదవ్ తల్లితో పాటు, ఉమాశంకర్ రెడ్డి భార్యతోనూ అక్రమ సంబంధాలు ఉన్నాయి. నిందితుల ఇళ్లలో ఎవరూ లేనప్పుడు వారి ఇళ్లకు వివేకానందరెడ్డి వెళ్లేవారు’’ అని అవినాష్ రెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు టీవీ చానెళ్లలో వార్తలు వచ్చాయి.
‘‘వివేకానందరెడ్డి రెండో భార్యకు ఆర్థికంగా అనుకూలంగా వ్యవహరిస్తున్నందుకే ఆయన కూతురు సునీత కక్ష గట్టింది. వివేకా రెండో భార్య కొడుక్కి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సీటు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. స్కూల్ పక్కనే విల్లా కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేశారు. వివేకానందరెడ్డి తన రెండో భార్యకు డబ్బులు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తారనే విషయం తెలిసి ఆయనతో సునీత గొడవపడ్డారు.
దస్తగిరిని ఢిల్లీకి పిలిచి చాలా రోజులు సీబీఐ వారి వద్ద ఉంచుకుంది. అక్కడే దస్తగిరిని అప్రూవర్‌గా మార్చారు. ఈ కేసులో నాపై ఎలాంటి ఆధారాలు లేవు. దస్తగిరి స్టేట్‌మెంట్ ఒక్కటే ప్రాముఖ్యంగా సీబీఐ తీసుకుంది. ఈ కేసులో ఇప్పటివరకు తాను నిందితుడిగా లేను. 2021లో సీబీఐ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో తనను అనుమానితుడిగా చేర్చారు. గూగుల్ టెకౌట్ ద్వారా నన్ను నిందితుడిగా చేర్చే ప్రయత్నం జరుగుతుంది. ఒక వ్యక్తి ఎక్కడున్నారో గూగుల్ టేకవుట్ డేటా చెప్పలేదు. నాలుగేళ్లలో అనేక పరిణామాల తర్వాత నన్ను లక్ష్యంగా చేసుకున్నారు. నన్ను అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలి. ఒక వేళ అరెస్టు చేస్తే బెయిల్‌పై విడుదల చేసేలా అదేశించాలి’’ అని అవినాష్ రెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇక, అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ ఈరోజు మధ్యాహ్నం 2.30 గంటల తర్వాత విచారణకు వచ్చే అవకాశం ఉంది.
