వివేకా హత్య కేసు.. సీబీఐ విచారణకు హాజరైన అవినాష్ రెడ్డి..
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఈరోజు సీబీఐ విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో అధికారులు ఆయనను ప్రశ్నించనున్నారు.
హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఈరోజు సీబీఐ విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో అధికారులు ఆయనను ప్రశ్నించనున్నారు. ఇక, ఈ కేసులో అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే ముందస్తు బెయిల్ మంజూరు చేస్తున్న సమయంలో కోర్టు పలు షరతులు విధించింది. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఆయనను విచారించాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే అవినాష్ రెడ్డి నేడు సీబీఐ ముందు విచారణకు హాజరయ్యారు.
అయితే వివేకా హత్య కేసుకు సంబంధించి అవినాష్ రెడ్డిని ఇప్పటికే పలుమార్లు సీబీఐ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. అయితే గత నెలలో విచారణకు రావాల్సిందిగా సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేయగా.. పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. మరోవైపు అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టి.. ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
ఈ సందర్భంగా పలు షరతులు కూడా విధించింది. అవినాష్ రెడ్డిని అరెస్టు చేసినట్లయితే రూ. 5లక్షల పూచీకత్తుతో బెయిల్‌పై విడుదల చేయాలని సీబీఐని ఆదేశించింది. సీబీఐ అనుమతి లేకుండా అవినాష్ రెడ్డి దేశం విడిచి వెళ్లరాదని షరతు విధించింది. సాక్షులను ప్రభావితం చేయవద్దని స్పష్టం చేసింది. జూన్ నెలాఖరు వరకు ప్రతి శనివారం ఉ. 10 నుంచి సా. 5గంటల వరకు సీబీఐ ఎదుట హాజరుకావాలని పేర్కొంది. సీబీఐ దర్యాప్తునకు సహకరించాలని అవినాష్‌ను ఆదేశించింది. షరతులు ఉల్లంఘిస్తే బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోరవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.