మాజీ మంత్రి, వైసీపీ అధినేత జగన్ బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి శుక్రవారం ఉదయం దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. కాగా...ఈ కేసులో సుధాకర్ రెడ్డి అనే వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వివేకా తండ్రి రాజా రెడ్డి హత్య కేసులో సుధాకర్ రెడ్డి ప్రధాన నిందితుడు. కాగా.. అతను ఇటీవల జైలు నుంచి విడుదలయ్యి బయటకు వచ్చాడు. కాగా.. అతనే రాజారెడ్డిని హత్య చేసి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.  

ఈ నేపథ్యంలో సుధాకర్ రెడ్డి ఓ మీడియా ఛానెల్ తో మాట్లాడుతూ.. తనకు వివేకా హత్యకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. కనీసం తనకు వైఎస్ వివేకా ఇళ్లు ఎక్కడ ఉందో కూడా తెలీదన్నారు. ఆయన చనిపోయారన్న విషయం తనకు శుక్రవారం సాయంత్రం తెలిసిందని తెలిపారు. 

వివేకా హత్య జరిగిన సమయంలో  తాను తన ఇంట్లోనే ఉన్నానని స్పష్టం చేశారు. గతంలో రాజారెడ్డి హత్య కేసులో కూడా తనపై కేసులు పెట్టి అన్యాయంగా ఇరికించారని ఆరోపించారు. ఆ కేసులో తాను 12ఏళ్లు జైలు శిక్ష గడపాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఉన్న కొద్ది భూమిలో వ్యవసాయం  చేసుకుంటూ గడుపుతున్నానని... ఈ హత్యతో తనకు సంబంధం లేదని చెప్పారు.