మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఇచ్చిన స్టేట్‌మెంట్‌కు కట్టుబడి ఉన్నానని చెప్పారు. తాను చెప్పినదాంట్లో నిజం ఉండటం వల్లే సీబీఐ అధికారులు అప్రూవర్‌గా చేశారని అన్నారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్లలో దస్తగిరి ఈరోజు మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిల నుంచి ఇప్పటికీ తనకు ప్రమాదం పొంచి ఉందని అన్నారు. తాను ఇచ్చిన స్టేట్‌మెంట్‌కు కట్టుబడి ఉన్నానని చెప్పారు. తాను చెప్పినదాంట్లో నిజం ఉండటం వల్లే సీబీఐ అధికారులు అప్రూవర్‌గా చేశారని అన్నారు. ఆధారాలు లేకుండా సీబీఐ ఎవరినీ విచారించదు కదా అని అన్నారు. అవినాష్ రెడ్డిని నిందితుడిగా చేస్తే సీబీఐకి ఏం లాభం అని ప్రశ్నించారు.
తాను అప్రూవర్‌గా మారడాన్ని చాలా మంది విమర్శిస్తున్నారని.. తాను అప్రూవర్‌గా మారిన సమయంలో వైఎస్ అవినాష్ రెడ్డి లాంటి వాళ్లు ఎందుకు ప్రశ్నించలేదని అన్నారు. వాళ్ల వరకు రానంతవరకు తాను మంచోడిని.. ఇప్పుడు చెడ్డ వ్యక్తినా అని ప్రశ్నించారు. తాను సీబీఐ నుంచి, వివేకానందరెడ్డి కూతురు సునీత నుంచి రూపాయి కూడా తీసుకోలేదని చెప్పారు.
Also Read: వారందరితో వైఎస్ వివేకాకు అక్రమ సంబంధాలు.. బెయిల్ పిటిషన్‌లో అవినాష్ రెడ్డి సంచలనం..
Also Read: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్.. చంచల్‌గూడ జైలులో ప్రవీణ్, రాజశేఖర్‌లను విచారిస్తున్న ఈడీ..
అప్పుడు డబ్బుకు ఆశపడి ఎర్రగంగిరెడ్డి చెప్పినట్టుగా చేశామని తెలిపారు. ఇప్పుడు తనకు అవసరం లేదు కనుకే సీబీఐకి నిజం చెప్పేశానని చెప్పారు. పలుకుబడి ఉందని సీబీఐ ఎస్పీ రామ్ సింగ్‌ను కూడా విచారణ నుంచి తప్పించేలా చేశారని అన్నారు. రామ్ సింగ్‌ను మార్చితే కొత్త బృందం కొత్తకోణంలో విచారిస్తుందా? అని ప్రశ్నించారు. ఈ కేసులో వారి పాత్ర తెలుసు కనుక ఎవరైనా అలాగే దర్యాప్తు చేస్తారని అన్నారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వైసీపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. మరోవైపు విచారణకు రావాల్సిందిగా అవినాష్ రెడ్డికి సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు తమ ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.
