మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు.
హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈరోజు ఉదయం విచారణకు హాజరుకావాల్సిందిగా వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేయగా.. ఆయన విచారణకు హాజరుకాలేదు. ఈ క్రమంలోనే నాలుగు రోజుల సమయం కోరుతూ సీబీఐ అధికారులకు అవినాష్ రెడ్డికి లేఖ రాశారు. ముందస్తుగా నిర్ణయించిన కార్యక్రమాల వల్ల విచారణకు రాలేనని కోరారు. షార్ట్ నోటీసు ఇచ్చినందున విచారణకు మరింత సమయం కావాలని విజ్ఞప్తి చేశారు.
ఈ క్రమంలోనే అవినాష్ రెడ్డి విజ్ఞప్తిపై సీబీఐ అధికారులు సానుకూలంగా స్పందించారు. అవినాష్ రెడ్డికి మళ్లీ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 19న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో స్పష్టం చేశారు.
పులివెందులకు అవినాష్ రెడ్డి..
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పటికే పలుమార్లు సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డిని విచారించారు. తాజాగా దాదాపు 20 రోజుల విరామం తర్వాత సోమవారం అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసింది. మంగళవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని సీబీఐ ప్రాంతీయ కార్యాలయంలో తమ ముందు విచారణకు హాజరు కావాలని పేర్కొంది. సీఆర్‌పీసీ సెక్షన్ 160 కింద ఈ నోటీసులు జారీచేసింది. ఈ క్రమంలోనే సీబీఐ అధికారులకు లేఖ రాసిన అవినాష్ రెడ్డి.. తన సొంత జిల్లాలో పార్టీ పరమైన కార్యకలాపాలు ముందుగా నిర్ణయించుకున్నందున నాలుగు రోజుల తర్వాత విచారణకు హాజరయ్యేందుకు అనుమతించాలని కోరారు. ఇక, అవినాష్ రెడ్డి మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి పులివెందులకు బయలుదేరారు.
