మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) విచారణ కొనసాగుతుంది. వైఎస్ వివేకా హత్య జరిగిన స్థలంలో లభించిన లేఖకు సంబంధించిన విచారణను సీబీఐ వేగవంతం చేసింది.

హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) విచారణ కొనసాగుతుంది. వైఎస్ వివేకా హత్య జరిగిన స్థలంలో లభించిన లేఖకు సంబంధించిన విచారణను సీబీఐ వేగవంతం చేసింది. ఈ లేఖ గురించే వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ప్రధానంగా ప్రస్తావిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ లేఖకు సంబంధించి సీబీఐ విచారణ సాగిస్తుంది. ఈరోజు కోఠిలోని సీబీఐ కార్యాలయంలో వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డి, వంట మనిషి శ్రీలక్ష్మి కొడుకు ప్రకాష్ విచారణకు హాజరయ్యారు. అధికారులు ఇద్దరినీ కలిపి ప్రశ్నిస్తున్నారు. లేఖను దాచిపెట్టడానికి సంబంధించి సీబీఐ వారిని ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. 

ఇదిలా ఉంటే.. సీబీఐ అధికారులు మంగళవారం కూడా కృష్ణా రెడ్డిని ఆరు గంటలకు పైగా విచారించారు. ఆయన వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. అయితే.. 2019 మార్చి 15న పులివెందులలోని తన సొంత నివాసంలో వైఎస్ వివేకా హత్యకు గురైన రోజున ఉదయం 5.30 గంటలకు ఆయన ఇంటి తలుపు తట్టిన మొదటి వ్యక్తి కృష్ణారెడ్డి అని చెబుతున్నారు. ఈ క్రమంలోనే వైఎస్ వివేకానందరెడ్డి మొబైల్ ఫోన్, అక్కడ లభించిన లేఖకు సంబంధించి కృష్ణారెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నట్టుగా సమాచారం. 

ఇదిలా ఉంటే.. ఈ కేసులో సాక్షిగా సీబీఐకి వాంగ్మూలం ఇచ్చిన వివేకా వాచ్‌మెన్ రంగన్న తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. ఈ క్రమంలోనే రంగన్నను మెరుగైన చికిత్స నిమిత్తం మంగళవారం పులివెందుల నుంచి తిరుపతికి తరలించారు. రంగన్నకు ఆస్తమా ఉందని.. తరచూ శ్వాస తీసుకోవడంలో సమస్యలు వస్తుంటాయని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.