కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బిటెక్ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి హత్యకు సంబంధించి వైఎస్ వివేకా కూతురు సునీత తనకు అనుమానం ఉన్నవారి పేర్లను హైకోర్టుకు సమర్పించిన నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్సీ బిటెక్ రవి కొన్ని వ్యాఖ్యలు చేశారు. 

సునీత సమర్పించిన అనుమానితుల జాబితాలో బిటెక్ రవి పేరు కూడా ఉంది. దీంతో ఆయన ఆ విషయంపై స్పందించారు.  వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును సీబీఐకి అప్పగించేందుకు ఏపీ సిఎం వైఎస్ జగన్ ఎందుకు వెనుకంజ వేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.

Also Read: నా తండ్రిని చంపిన వారి నుండి ప్రాణ ముప్పు: డీజీపీకి వివేకా కూతురు లేఖ

వివేకా హత్య జరిగిన తర్వాత ఆయన భార్య సౌభాగ్యమ్మ హైకోర్టులో పిటిషన్ వేస్తూ తనతో పాటు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డిపై కూడా ఆరోపణలు చేసిన విషాయన్ని ఆయన గుర్తు చేసారు. ఇప్పుడు వైఎస్ కుటుంబ సభ్యులపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సునీత హైకోర్టులో పిటిషన్ వేసినా జగన్ ఎందుకు కేసును తేల్చడం లేదని ఆయన అడిగారు. 

వైఎస్ వివేకా హత్య కేసులో ఎవరిని రక్షించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సిబిఐ విచారణ కోరిన జగన్ ఇప్పుడెందుకు ఆ పనిచేయడం లేదని ప్రశ్నిం్చారు. 

Also Read: వైఎస్ వివేకా హత్య కేసు: పేర్లు వెల్లడించిన కూతురు సునీత. జాబితా ఇదే...

వివేకా హత్య కేసులో అమాయకులను బలి చేయకూడదనే ఉద్దేశంతో సిబిఐ విచారణ కోరుతూ తాను హైకోర్టులో పిటిషన్ వేసినట్లు ఆయన తెలిపారు. తనకు ప్రాణహాని ఉందంటూ జగన్ సోదరి సునీత హైకోర్టులో చెప్పుకున్నారంటే రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చునని ఆయన అన్నారు. వివేకా హత్యతో తనకు ప్రమేయం ఉన్నట్లు రుజువైతే పులివెందలు పూలంగళ్ల వద్ద తనను కాల్చేయాలని ఆయన అన్నారు.