కడప: మాజీ మంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తును సిట్ వేగవంతం చేసింది. శుక్రవారంనాడు సిట్ అధికారులు 200 మందిని విచారించారు. కడప జిల్లా పులివెందుల డిఎస్పీ కార్యాలయంలో ఉదయం ఆరు గంటల నుంచి విచారణ సాగించారు. 

వైఎస్ కుటుంబానికి చెందిన వైఎస్ మనోహర్ రెడ్డి, వైఎస్ మదన్మోహన్ రెడ్డిలతో పాటు పలువురిని సిట్ అధికారులు విచారించారు. వివేకానంద రెడ్డి హత్య జరిగిన రోజు, అంతకు ముందు రెండు రోజుల కాల్ లిస్టును తీసుకుని, దాని ప్రకారం 200 మందిని డిఎస్పీ కార్యాలయానికి పిలిపించి డిఎస్పీ, సిఐలు విడివిడిగా విచారించారు. 

వివేకానంద రెడ్డి హత్య కేసుపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పులివెందుల డిఎస్పీ వాసుదేవన్ చెప్పారు. కోర్టు అనుమతితో ముగ్గురికి నార్కో అనాలిసిస్ పరీక్షలు చేశారు. ఆరోగ్యం సహకరించకపోవడంతో మరికొరికి పరీక్షలు నిర్వహించలేదు. 

మొబైల్ డేటా ఆధారంగా ఇప్పటి వరకు 1300 మందిని అధికారులు విచారించారు. మరికొంత మందిని కూడా విచారించే అవకాశం ఉంది. సిట్ బృందంలో ముగ్గురు డిఎస్పీలు, ఆరుగురు సిఐలు, 18 మంది ఎస్సైలున్నారు.