ఏపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ షర్మిల .. జగన్ రెడ్డి అంటూ అన్నపై విమర్శల బాణాలు
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం జరిగిన కార్యక్రమంలో షర్మిల ప్రమాణం స్వీకరించారు చేశారు.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం జరిగిన కార్యక్రమంలో షర్మిల ప్రమాణం చేశారు. అనంతరం షర్మిల మాట్లాడుతూ.. రెండు సార్లు పీసీసీ అధ్యక్షుడిగా, రెండు సార్లు సీఎంగా వైఎస్ఆర్ పనిచేశారని తెలిపారు. వైఎస్ బిడ్డగా తనకు ఈ బాధ్యతను ఇవ్వడం గర్వంగా వుందని, ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అన్నారు. తాను రావాలని, పనిచేయాలని చాలా మంది త్యాగాలు చేశారని వారందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నానని షర్మిల చెప్పారు.
గడిచిన పదేళ్లుగా ఏపీలో అభివృద్ధి జరిగిందా అని ప్రశ్నించారు. రాష్ట్రం ఏర్పడిన నాటికి లక్ష కోట్లు అప్పులు వుంటే.. చంద్రబాబు రెండున్నర, జగన్ మూడు లక్షల కోట్లు అప్పులు చేశారని ఆమె దుయ్యబట్టారు. ప్రస్తుతం 10 లక్షల కోట్ల భారం ఏపీ మీద వుందని.. పదేళ్లుగా రాజధాని లేదని, రాష్ట్రంలో ఒక్క మెట్రో కూడా లేదన్నారు. పట్టుమని పది పెద్ద పరిశ్రమలు రాలేదని , రోడ్లు వేయడానికి, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవన్నారు. దళితుల మీద దాడులు వందకు వంద శాతం పెరిగాయని.. ఇసుక, లిక్కర్, మైనింగ్ మాఫియా దోచుకోవడం దాచుకోవడమేనని షర్మిల ఆరోపించారు.