అమరావతి: ఆంధ్రజ్యోతి దినపత్రికపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారంనాడు ఆ పత్రిక ప్రచురించిన వార్తాకథనంపై ఆమె స్పందించారు. ఈ మేరకు ఆమె సోమవారంనాడు ఓ ప్రకటన విడుదల చేశారు.

వైఎస్ జగన్ కుటుంబంలో విభేదాలు చోటు చేసుకున్నాయని, దాంతో వైఎస్ షర్మిల జగన్ మీద కోపంతో తెలంగాణలో పార్టీ పెట్టబోతున్నారని, తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెసు పార్టీని ఆమె స్థాపించబోతున్నారని, ఇందుకు తల్లి వైఎస్ విజయమ్మ ఆశీస్సులు కూడా ఉన్నాయని ఆంధ్రజ్యోతి ఓ భారీ వార్తాకథనాన్ని ప్రచురించింది. 

దానిపై షర్మిల స్పందించి ఓ ప్రకటన విడుదల చేశారు తప్పుడు వార్తాకథనాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. ఆదివారంనాడు ఆంధ్రజ్యోతి పత్రికలో బ్యానర్ ఐటమ్ గా వచ్చన వార్త తన దృష్టికి ఆలస్యంగా వచ్చిందని, వైఎస్సార్ కుటుంబాన్ని లక్ష్యం చేసుకుని దురుద్దేశంతో రాసిన రాతలను తీవ్రంగా ఖండిస్తున్నానని షర్మిల అన్నారు 

ఏ పత్రిక అయినాా, ఏ చానెల్ అయినా ఓ కుటుంబానికి సంబంధించిన విషయాలను రాయడమే తప్పు అని, అది నీతిమాలిన చర్య అని ఆమె అన్నారు. అటువంటి తప్పుడు రాతరలు రాసిన పత్రిక, చానల్ మీద న్యాయపరమైన చర్యలకు వెనుకాడబోమని ఆమె హెచ్చరించారు.