YS Sharmila: దమ్ముంటే బీజేపీపై ఫైట్ చేయండి.. అన్న జగన్‌కు షర్మిల సవాల్
వైఎస్ షర్మిల అన్న వైఎస్ జగన్‌కు సవాల్ విసిరారు. దమ్ముంటే బీజేపీపై గాండ్రించాలని అన్నారు. చంద్రబాబు, జగన్ బీజేపీతో పొత్తుల కోసం పోటీ పడుతున్నారు. వీరిది ట్రయంగిల్ లవ్ స్టోరీ అని విరుచుకుపడ్డారు.
YS Jagan: ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల.. ఆమె అన్నయ్య, వైసీపీ చీఫ్, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సవాల్ విసిరారు. ఇక్కడ సింహాలు, పులులు అని అభిమానులు చెప్పుకుంటున్నారని, ఎవరికి పులులు, సింహాలు అని ప్రశ్నించారు. దమ్ముంటే ఒకసారి బీజేపీ మీద పంజా విసరాలని చెప్పండని అన్నారు. దమ్ముంటే ఆ పార్టీ మీద గాండ్రించాలని సవాల్ చేశారు.
వైఎస్ షర్మిల దెందులూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్, చంద్రబాబుపై విమర్శలు సంధించారు. వైసీపీపై విరుచుకుపడుతూ.. పులులు, సింహాలు కాదు.. ఆంధ్ర రాష్ట్రానికి ద్రోహులని ఆరోపణలు చేశారు. ఆడబిడ్డలను బజారుకు ఈడుస్తున్నారని, ఆడబిడ్డలపై బూతులు మాట్లాడుతున్నారని అన్నారు. వైసీపీకి ఇదే సాధ్యమైందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో అధికారంలో ఉండి అటు జగన్, ఇటు చంద్రబాబు ప్రత్యేక హోదాను సాధించలేకపోయారని షర్మిల మండిపడ్డారు. పైగా.. పొత్తుల కోసం పోటీపడుతున్నారని ఆరోపణలు చేశారు. వారు పిలవడం ఏమిటో.. ఈయన వెళ్లడం ఏమిటో తనకు అర్థం కావడం లేదని వివరించారు. ఒక వేళ పొత్తుకు వెళ్లినా.. ప్రత్యేక హోదా ఇస్తేనే పొత్తు కుదుర్చుకుంటామని చంద్రబాబు ఎందుకు షరతు పెట్టలేదని అన్నారు. కానీ, ఆయన షరతు పెట్టలేదని, ఎందుకంటే ఆయనకు రాష్ట్ర ప్రయోజనాలపై చిత్తశుద్ధి లేదని ఫైర్ అయ్యారు. బీజేపీ, జగన్, చంద్రబాబులది ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని అన్నారు.