Asianet News TeluguAsianet News Telugu

ఎల్జీ పాలిమర్స్ కు 219 ఎకరాలు, రూ.2,500కే...ఆ అనుమతులూ వైఎస్ ఇచ్చినవే: చంద్రబాబు

విశాఖ  గ్యాస్ లీకేజీ ఘటనకు కారణమైన ఎల్జీ పాలిమర్స్ సంస్థకు వివిధ రకాల అనుమతులిచ్చింది ప్రస్తుతం ముఖ్యమంత్రి తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డేనని టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. 

YS Rajashekar Reddy Gave Permissions For LG Polymers; Chandrababu
Author
Guntur, First Published May 19, 2020, 8:33 PM IST

విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజి దుర్ఘటన జరిగి 10రోజులు దాటిందని...12మంది చావులకు, 365మంది తీవ్ర అస్వస్థతకు, 5గ్రామాలతో పాటు యావత్ విశాఖ నగరంలోనే కల్లోలాన్ని సృష్టించిన కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకోకపోవడం ఏమిటని మాజీ సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. సీఎం జగన్ మొక్కుబడి స్పందన, కంటి తుడుపు కమిటీల ఏర్పాటు, వైసిపి మంత్రుల నిద్ర నాటకాలు ఇవన్నీ పార్టీ చేతులకు అంటిన బురద తుడుచుకునే పనులేనని ఆరోపించారు. 

''సీఎం జగన్మోహన్ రెడ్డి అబద్దాలు నిన్న పరాకాష్టకు చేరాయి. ఎల్జీ పాలిమర్స్ కు ఒక్క అనుమతి కూడా వైసిపి ప్రభుత్వం ఇవ్వలేదు అనడం కన్నా పచ్చి అబద్దం మరొకటి లేదు. అబద్దాలతో తప్పుడు ప్రచారం చేసి రాజకీయ లాభాలు పొందాలని చూడటం హేయం. నిన్న జగన్మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలను ఖండిస్తూ వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతున్నాం'' అంటే ఎల్జీ పాలిమర్స్ అనుమతులకు సంబంధించిన వివరాలను బయటపెట్టారు. 

''1961 నుంచి 2020వరకు ఈ కంపెనీ పూర్వాపరాలను ప్రజల దృష్టికి తెస్తున్నాం. ఎల్జీ పాలిమర్స్  కంపెనీ వినియోగిస్తున్న 219ఎకరాల భూమిని 23.11.1964న అప్పటి ప్రభుత్వం ఎకరం రూ2,500 చొప్పున కేటాయించింది( జివో నెం 217). ఆ తర్వాత అర్బన్ ల్యాండ్ సీలింగ్ మినహాయింపులను 8.10.1992న అప్పటి ప్రభుత్వం ఇచ్చింది(జీవో నెం 1033). టిడిపి హయాంలో ఒక్క ఎకరం భూమి కూడా ఎల్జీ పాలిమర్స్ కు కేటాయించలేదు'' అని పేర్కొన్నారు. 

''భూముల కేటాయింపుపై వైసిపి చేస్తున్న దుష్ప్రచారం దీనిని బట్టే తెలుస్తోంది. 08.05.2007న వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం పొల్యూషన్ కంట్రోల్ క్లియరెన్స్ ఇచ్చింది. 01.09.2009న మరోసారి రాజశేఖర రెడ్డి ప్రభుత్వమే పొల్యూషన్ కంట్రోల్ క్లియరెన్స్ ఇచ్చింది. ఆ తరువాత కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం 13.04.2012న, 06.05.2012న క్లియరెన్స్ ఇచ్చింది. అంటే రాజశేఖర రెడ్డి ప్రభుత్వం 2సార్లు, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం 2సార్లు పొల్యూషన్ కంట్రోల్ క్లియరెన్స్ లు ఇచ్చాయి. టిడిపి ప్రభుత్వం గత ప్రభుత్వాల పొల్యూషన్ కంట్రోల్  సర్టిఫికెట్లను రెన్యువల్ చేసిందే తప్ప కొత్తగా అనుమతి ఇవ్వలేదు'' అని తెలిపారు.

'' అంతేకాకుండా టిడిపి ప్రభుత్వం పాలిస్టైరీన్ ఉత్పత్తులకు, ఎక్స్ పాండబుల్ పాలిస్టైరీన్ ఉత్పత్తుల విస్తరణకు అనుమతి నిరాకరించింది. కంపెనీకి ఎప్పుడెప్పుడు ఏయే ప్రభుత్వాలు ఎలాంటి అనుమతులు ఇచ్చాయో మావద్ద ఉన్నాయి. వీటిపై చర్చకు సిద్దమా అని ఛాలెంజ్ చేస్తున్నాం. రాజశేఖర రెడ్డి ప్రభుత్వం 08.05.2007న మరియు 01.09.2009న ఇచ్చిన అనుమతులను ఎందుకు జగన్మోహన్ రెడ్డి బైట పెట్టలేదు..? తండ్రి ఇచ్చిన అనుమతి ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కొడుకుగా జగన్ పై లేదా..?'' అని నిలదీశారు. 

READ MORE  ఎల్జీ పాలీమర్స్ వద్ద ఉద్రిక్తత: ఫ్యాక్టరీ ముందు వెంకటాపురం వాసుల ధర్నా

''20.06.2019 నుంచి 23.06.2019 వరకు మీ ప్రభుత్వం ఏం చేసిందో ఇవే రుజువులు. విజయవాడలో జరిగిన స్టేట్ ఎక్స్ పర్ట్ అప్రైజల్ కమిటి(ఎస్ ఈఏసి) సమావేశంలో అజెండాలో 128.48 అంశం కింద ఎల్జీ పాలిమర్స్  అప్లికేషన్ ను క్లియరెన్స్ చేసి స్టేట్ లెవల్ ఎన్విరాన్ మెంట్ ఇంపాక్ట్ అసెస్ మెంట్ అథారిటి(ఎస్ ఈఐఏఏ) కు  పంపారు. ఇది  వాస్తవం కాదా. 
స్టైరీన్ విస్తరణకు అనుమతిని టిడిపి ప్రభుత్వం నిరాకరించిందని ఎల్జీ పాలిమర్స్ కంపెనీ ఇచ్చిన అఫిడవిట్ లోనే చెప్పారు(10.05.2019న  అఫిడవిట్)టిడిపి అనుమతి ఇచ్చింది కేవలం ఇంజనీరింగ్ ప్లాస్టిక్స్ ఉత్పత్తులకే. స్టైరీన్ ఉత్పత్తుల విస్తరణకు అనుమతి నిరాకరించింది. 27.12.2018 మరియు 20.6.2018న టిడిపి ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు వైసిపి నాయకులు, దొంగ సాక్షి చేస్తున్న ప్రచారం వాస్తవాలను వక్రీకరించడమే'' అని మండిపడ్డారు. 

''ఎల్జీ పాలిమర్స్ కేటగిరి మార్పు వెనుక హస్తం వైసిపిది కాదా..? ఈ కంపెనీ స్టైరీన్ ఉత్పత్తుల విస్తరణకు అనుమతి ఇచ్చింది ఎవరు..? 2019 జులై 9న కేంద్రానికి సిఫారసు చేసింది మీరు కాదా..?( ఏపి స్టేట్ లెవెల్ ఎన్విరాన్ మెంట్ ఇంపాక్ట్ అసెస్ మెంట్ అథారిటి పంపిన సిఫారసు పేపర్లను చూపిస్తూ)విశాఖలో జరిగిన దుర్ఘటనపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ హుటాహుటిన స్పందించి రూ50కోట్ల డిపాజిట్ చేయాలని కంపెనీని ఆదేశించింది. దీనిపై స్టే కోసం ఎల్జీ పాలిమర్స్ సుప్రీంకోర్టుకు వెళ్లడం వెనుక హస్తం వైసిపిదే'' అని ఆరోపించారు. 

''ఇంత దురాగతానికి పాల్పడిన కంపెనీకి సీఎం జగన్ వత్తాసు పలుకుతారు. పరిహారం కంపెనీ నుంచి ఇప్పించకుండా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇస్తారు. కంపెనీతో తామేదో మాట్లాడుకుంటామని నిస్సిగ్గుగా చెబుతారు. ఆ కంపెనీలోనే ఉద్యోగాలు ఇప్పిస్తామని హామీ ఇస్తారు. ఈ వ్యాఖ్యలతోనే ఎల్జీ పాలిమర్స్ తో వైసిపికి ఉన్న ములాఖత్ రుజువైంది. 
ముఖ్యమంత్రి స్థాయిలో అబద్దాలు చెప్పడం మంచిది కాదు. తన అబద్దాలతో జగన్ సీఎం హోదాను దిగజారుస్తున్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి ఉండటం దౌర్భాగ్యం'' అని  మండిపడ్డారు. 

''లాక్ డౌన్ ఆంక్షల సడలింపుపై ‘‘మే 1న’’ కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు ఇచ్చింది. నిత్యావసరాలు, ఫుడ్ ప్రాసెసింగ్, మెడికల్, ఫార్మా ఐటి హార్డ్ వేర్, జూట్ ఇండస్ట్రీస్ తదితర పరిశ్రమలనే తెరవాలని  స్పష్టంగా చెప్పింది. ఆ జాబితాలో పెట్రో కెమికల్స్ లేకపోయినా ఎల్జీ పాలిమర్స్ కు మీరెందుకు అనుమతి ఇచ్చారు..? లాక్ డౌన్ లో కేంద్రం అనుమతి లేకున్నా ఎల్జీ పాలిమర్స్ తెరిచేందుకు మీరెలా అనుమతి ఇచ్చారు.? కంపెనీని అడిగేందుకు ప్రశ్నలు పంపాలట. కమిటి వేసే ప్రశ్నలకు జనం అడిగే ప్రశ్నలు కలిపి కంపెనీకి పంపుతారట. వాళ్లిచ్చిన జవాబును బట్టి చర్యలు తీసుకుంటారట. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడుపుతోంది వైసిపి నాయకులా ఎల్జీ పాలిమర్స్ ప్రతినిధులా..? ఎల్జీ పాలిమర్స్, వైసిపి లాలూచి రాజకీయాలకు ఇవే నిదర్శనం'' అని తెలిపారు. 

READ MORE  కరోనా రానివారు ఉండరేమో: వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు

''12మంది చావుకు కారణమైన కంపెనీపై చర్యలు లేవు. పది రోజులైనా ఎవరినీ అరెస్ట్ చేసింది లేదు. దానిపై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన వృద్దురాలు రంగనాయకమ్మపై తప్పుడు కేసులు పెట్టడానికి చేతులేలా వచ్చాయి..? 66ఏళ్ల వృద్దురాలైన ఒక సమాజ సేవకురాలిపై అక్రమ కేసు పెట్టడాన్ని ఖండిస్తున్నాం. వైసిపి ప్రభుత్వ దుర్మార్గ చర్యలను గర్హిస్తున్నాం'' అన్నారు. 

''10రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి మళ్లీ విశాఖ తొంగిచూడకుండా నిన్న వీడియో కాన్ఫరెన్స్ పేరుతో డ్రామా చేశారు. హుద్ హుద్ విపత్తులో టిడిపి ప్రభుత్వ పనితీరుకు, ఇప్పటి దుర్ఘటనలో వైసిపి ప్రభుత్వ పనితీరును విశాఖ వాసులే బేరీజు వేస్తున్నారు. సోషల్ మీడియాలో వైసిపి నాయకుల నిర్వాకాలపై ధ్వజమెత్తుతున్నారు. 10రోజులైనా గ్రామాల్లో పరిస్థితులు చక్కదిద్ద లేకపోవడం, బాధితుల్లో భరోసా లేకపోవడం కంపెనీపై చర్యలు చేపట్టక పోవడం, పదిరోజులైనా ఎవరినీ అరెస్ట్ చేయకపోవడం వైసిపి ప్రభుత్వ వైఫల్యాలకు హద్దు అదుపు లేదు. దుర్ఘటనపై సైంటిఫిక్ స్టడీగురించి గాని, కమిటిలలో నిపుణుల నియామకంపైగాని, దీర్ఘకాలిక ఉపశమన చర్యలపై గాని, పరిహారం చెల్లింపులో వివక్షతపైగాని, బాధితులపై-వారికి అండగా నిలబడ్డ ప్రతిపక్షాల నాయకులపై కేసుల గురించి కాని సీఎం నోరు తెరవలేదంటేనే కంపెనీతో వైసిపి లోగుట్టు తెలుస్తోంది'' అని పేర్కొన్నారు. 

''తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోడానికి టిడిపిపై సీఎం జగన్మోహన్ రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారు. దీనిని బట్టే జగన్మోహన్ రెడ్డిని మించిన అబద్దాల కోరు మరొకరు లేరనేది స్పష్టం అవుతోంది. టిడిపిపై కక్ష సాధింపుతోనో, నాపై అక్కసుతోనో రాష్ట్రానికి, భావితరాలకు నష్టం చేసే చర్యలకు ఇకనైనా జగన్మోహన్ రెడ్డి స్వస్తి చెప్పాలి. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ దుర్ఘటన బాధిత కుటుంబాలకు దక్షిణ కొరియాలో ఇచ్చినట్లుగా పరిహారం అందజేయాలని, వారిని  దీర్ఘకాలంలో కలిగే అనర్ధాలనుంచి కాపాడటంపై దృష్టి పెట్టాలని, సూపర్ స్పెషాలిటి హాస్పటల్ ఆ 5 గ్రామాల వారికి అందుబాటులో నెలకొల్పాలని, వారికి అందులో అత్యున్నత చికిత్స లభ్యం అయ్యేలా చూడాలని, అందరికీ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులు మెయింటైన్ చేయాలని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని, ఆయా ప్రాంతాల్లో పర్యావరణాన్ని, భూగర్భ జలాలను పరిరక్షించాలని'' చంద్రబాబు ప్రభుత్వానికి సూచించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios