కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై సోదరుడు వైఎస్ ప్రతాప్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్యపై తమకు ఎలాంటి అనుమానాల్లేవని ఆయన అన్నారు. సీబీఐ విచారణ కోరడం రాజకీయంగా చేసిన వ్యాఖ్య కావచ్చునని అన్నారు.

రాజకీయంగా చాలా మంది చాలా మాట్లాడుతారని, రాజకీయాలతో తమకు సంబంధం లేదని వైఎస్‌ ప్రతాప్‌రెడ్డి అన్నారు. మైనింగ్ ఆర్దిక లావాదేవీల విషయంలో తన ఇంటి ముందు వివేకా ధర్నా చేసిన మాట వాస్తవమేనని ఆయన అన్నారు. 

మైనింగ్‌ లావాదేవీలతో వైఎస్ హత్యకు సంబంధం లేదని ఆయన అన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి తన ఇంటిలో ఇటీవల దారుణంగా హత్యకు గురైన విషయం తెలిసిందే.

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య రాజకీయ రంగు పులుముకుంది. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు.