ప్రధాని తీసుకున్న నిర్ణయం వల్ల చంద్రబాబు లాంటి కొందరు మాత్రమే లబ్దిపొందినట్లు ఆరోపించారు.

‘ఒకే దెబ్బకు రెండు పిట్ట’లన్నట్లుగా పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై అటు ప్రధానమంత్రి, ఇటు చంద్రబాబునాయడును వైఎస్ జగన్మోహన్ రెడ్డి తూర్పారపట్టారు. పనిలో పనిగా నోట్ల రద్దు నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేసారు. ముందస్తు ఏర్పాట్లు లేకుండా, ఎవరి అభిప్రాయాలను తెలుసుకోకుండా పెద్ద నోట్ల రద్దు వల్ల దేశమంతా ఇబ్బందులు పడుతోందని జగన్ ధ్వజమెత్తారు.

నల్లధనాన్ని వెలికి తీయటానికి, దొంగనోట్ల నియంత్రణకు ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయం, ఉద్దేశ్యం మంచిదే అయినా ఆచరణలో విఫలమైందని జగన్ అభిప్రాయపడ్డారు. కాబట్టి, నోట్ల రద్దు నిర్ణయాన్ని వాయిదా వేయించటంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు కూడా బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేసారు. ప్రధాని తీసుకున్న నిర్ణయం వల్ల చంద్రబాబు లాంటి కొందరు మాత్రమే లబ్దిపొందినట్లు ఆరోపించారు.

చెలామణిలో 86 శాతంమున్న వెయ్యి, 500 రూపాయల నోట్ల రద్దుతో దేశవ్యప్తంగా అల్లకల్లోలం మొదలైనట్లు చెప్పారు. మనది గ్రామీణ దేశమని బ్యాంకులు, ఏటిఎంలు ఇప్పటికీ దేశంలోని పలు గ్రామాల్లో అందుబాటులో లేవన్న విషయాన్ని ప్రధాని గమనించాలన్నారు. స్వైపింగ్ మెషీన్లు అందుబాటులోకి తెస్తున్నామని చెప్పటంలో అర్ధం లేదన్నారు.

ఎందుకంటే, దేశప్రజల అవసరాలను తీర్చాలంటే 127 కోట్ల జనాభాకు కనీసం 30 కోట్ల స్వైపింగ్ మెషీన్లు అందుబాటులోకి తేవాలన్నారు. మరి అన్ని కోట్ల మెషీన్లు తేగలరా అని కేంద్రాన్ని ప్రశ్నించారు. మెజారిటీ రైతులు, రైతు కూలీలకు మెషీన్లు పెట్టి ఉపయోగం ఏమిటని నిలదీసారు. దేశంలో 53 శాతం ప్రజలకు మాత్రమే బ్యాంకు ఖాతాలున్నట్లు చెప్పారు.

కరెన్సీ కోసం క్యూలైన్లోలో నిలబడి మృతిచెందిన 70 మంది కుటుంబాలకు నష్టపరిహారం ఇస్తే బాగుంటుందని సూచించారు. అన్నీ వర్గాలు పడుతున్న సమస్యలను తెలుసుకున్న తర్వాతనే తాను స్పందిస్తున్నట్లు చెప్పారు. ప్రజల గొతుక కాబట్టే ప్రతిపక్షాలు పెద్ద నోట్ల రద్దు సమస్యను లేవనెత్తుతున్నట్లు వివరించారు. నోట్ల రద్దు వల్ల ప్రజలెవరూ సంతోషంగా లేరని తెలిపారు. కాబట్టి నోట్ల రద్దుపై నిర్ణయాన్ని వాయిదా వేసుకుని కోంత కాలం గడువు ఇచ్చి అప్పుడు రద్దు చేయాలని జగన్ ప్రధానికి సూచించారు.