Asianet News TeluguAsianet News Telugu

వైఎస్ జగన్మోహన్ రెడ్డి : వైఎస్సార్సీపీలో 40మంది సిట్టింగులకు నో ఛాన్స్...

ఏపీలో అధికార పార్టీలో మార్పులు కలకలం రేపుతున్నాయి. ఇంకా భారీ మార్పులు ఉండబోతున్నాయని పార్టీ నేతలు హింట్స్ ఇస్తున్నారు. ఇదంతా వచ్చే ఎన్నికల్లో విజయం కోసమేనా?

YS Jaganmohan Reddy: No chance for 40 people sitting in YSRCP - bsb
Author
First Published Dec 13, 2023, 6:58 AM IST

తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ఇంకా రెండు, మూడు నెలల సమయం ఉండగానే.. రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యంగా అధికార వైఎస్ఆర్సీపీలో నియోజకవర్గాల ఇన్చార్జిల మార్పు తీవ్రదుమారాన్ని రేపుతోంది. మరోవైపు ఈసారి ఎన్నికల్లో దాదాపుగా 40 మంది అభ్యర్థులను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మారుస్తారని సమాచారం. దీంతో పార్టీలో తీవ్రస్థాయిలో కలకలం రేగుతోంది. 2019లో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సిపి.. 2024లో కూడా  అంతకుమించిన ఆధిక్యంతో అధికారంలోకి రావాలని భావిస్తోంది.దీనికోసం వైయస్ జగన్ కఠినంగా వ్యవహరించబోతున్నారు. దీంట్లో భాగంగానే కీలక సంస్కరణలకు పూనుకున్నారు.

అధికార వైసిపికి చెందిన నియోజకవర్గాల ఇన్చార్జులకు తోడు ఎమ్మెల్యేల విషయంలోనూ కఠిన నిర్ణయం తీసుకోబోతున్నారు. అంతకుముందే ఈసారి ఎన్నికల్లో 30 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చాలని అనుకున్నారు జగన్. కానీ తాజాగా ఈ సంఖ్యలో మార్పు వచ్చిందట. మార్చాల్సిన వారు 30 మంది కాదు 40మంది అని తెలుస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో సామాజిక వర్గాల ప్రభావం, అభ్యర్థులకు ప్రజల్లో ఉన్న స్పందన, వారి పనితీరును ఆధారంగా ఈ అంచనా వేస్తున్నారట. దీనికి తోడు ఆయా నియోజకవర్గాలలో టిడిపి - జనసేన ప్రభావం ఎలా ఉంటుందని దానిని పరిగణలోకి తీసుకొని  అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది.

వైసీపీలో మార్పులపై టీడీపీ - జనసేన నేతల వ్యాఖ్యలు .. ‘‘ ముందు మీ ఇల్లు చక్కబెట్టుకోండి’’ అంటూ సజ్జల కౌంటర్

మరికొన్ని నియోజకవర్గాలలో ఇప్పుడున్న సామాజిక వర్గాల వారి నుంచి వేరే సామాజిక వర్గాలకు ప్రాధాన్యత మారుస్తున్నారు.. మంగళగిరి నియోజకవర్గంలో కూడా ఇదే జరిగింది. దీంతోనే  సిట్టింగ్ ఎమ్మెల్యే,  రెండుసార్లు నారా లోకేష్ మీద గెలిచిన ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు. ఆయనకు వైఎస్ జగన్ పనితీరు మార్చుకోవాలని ఫోన్ చేసినట్టుగా సమాచారం. ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం కంటే..  బీసీ సామాజిక వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఉన్నట్లుగా గుర్తించి ఆ మేరకు మార్పులు చేసినట్లు తెలుస్తోంది. 

‘గడప గడపకు మన ప్రభుత్వం వర్క్ షాప్’ జరిగిన సమయంలోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లుగా పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.  ఆ సమయంలో నాయకుల పనితీరుపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. కొంతమందికి అయితే నేరుగా ఫోన్ చేసి పని తీరు మార్చుకోవాలని చెప్పినట్లుగా సమాచారం. వారికి కొంత సమయం ఇచ్చి పని తీరు మార్చుకోమని చెప్పారని.. అయినా మెరుగుపడని వారి విషయంలో  మార్చే నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

పనితీరు బాగాలేదని చెప్పిన నాయకులు కొంతమంది రాజీనామాల రూపంలో బయటికి వస్తుండగా మరి కొంతమంది.. విషయం బయటకు తెలియకుండా పార్టీలోనే కొనసాగుతున్నారని తెలుస్తోంది.మొత్తంగా ఈసారి ‘వై నాట్ 175’ అనే దానిపై వైయస్ జగన్  తీవ్రంగానే కృషి చేస్తున్నారు.  చూడాలి మరి ప్రజలు ఏ తీర్పు ఇస్తారో.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios