హైదరాబాద్: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అన్న పిలుపు పేరుతో తటస్థులను దగ్గరకు చేసుకునేందుకు  ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంకల్పయాత్ర నిర్వహించిన వైఎస్ జగన్ పాదయాత్ర సమయంలో కొంతమంది తటస్థులను వైఎస్ జగన్ గుర్తించినట్లు తెలుస్తోంది. 
అలాగే ఎన్నికల వ్యూహకర్త పీకే మరియు అతని టీం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తటస్థులను గుర్తించి ఆ జాబితాను ఇచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తటస్థులకు లేఖలు రాశారు. స్థానికంగా ప్రభావితం చేస్తున్న లేఖలను గుర్తించిన వైఎస్ జగన్ నేరుగా వారికి లేఖలు రాశారు. 

పలు విధాలు ప్రజా సంక్షేమానికి పాటుపడుతున్న వారిని అభినందిస్తూ రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తగు సూచనలు సలహాలు ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో లేఖ చివర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సబంధించిన ఈ మెయిల్, ఫోన్ నంబర్ ను కూడా లేఖలో పొందుపరిచారు. 

వైసీపీకి సంబంధించి పలు సూచనలు ఈ మెయిల్ కు చేరవెయ్యాలని కోరారు. అలాగే తటస్థులను త్వరలోనే వైఎస్ జగన్ కలిసే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. అటు ఆయా నియోజకవర్గాల్లో తటస్థులను గుర్తించిన జగన్ ఆయా నియోజకవర్గ సమన్వయ కర్తలకు పలు సూచనలు చేశారు. 

తటస్థులను గుర్తించి వారి మద్దతు దక్కించుకోవడంతోపాటు వారి సూచనలు తీసుకోవడం వారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులయ్యేలా చూడాలని కోరారు. తటస్థులు స్థానిక ఓటింగ్ ను ప్రభావితం చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో వారిని కలుపుకుపోవాలని జగన్ సూచించినట్లు తెలుస్తోంది. మెుత్తానికి అన్న పిలుపు కార్యక్రమం కార్యక్రమం వైసీపీకి మరింత మేలు చేకూరుతోందని ఆ పార్టీ భావిస్తోంది.