నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పదో తరగతి పరీక్షల్లో పేపర్ లీక్ వ్యవహారంలో వైఎస్ జగన్ పట్టుబడ్డాడని ఆయన ఆరోపించారు. 

ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలనే వైఎస్ జగన్ ప్రభుత్వ నిర్ణయంపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఆయన ఆ వ్యాఖ్య చేశారు.

Also Read: జూ.ఎన్టీఆర్ ది ముగిసిన కథ, వంశీ నీకు సిగ్గుందా: నారా లోకేష్ ధ్వజం 

"జగన్మోహన్ రెడ్డి ఏం చదివాడో మీకు తెలుసా? బిఏ లేదా బీకాం చదివాడని వాళ్లు చెబుతారు. ఆయన పాసయ్యాడో లేదో మీకు తెలుసా? అటువంటివాళ్లు ఉద్బోధలు చేస్తున్నారు" అని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. 

ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన ఉండాలని తాము ఎప్పుడో చెప్పామని, అయితే ఏ మీడియంలో తమ పిల్లలు చదువుకోవాలనే విషయాన్ని నిర్ణయించుకునే హక్కు తల్లిదండ్రులకు ఉండాలని ఆయన అన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయించి, అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేస్తోంది. దానిపై ఓ కమిటీని కూడా వేసింది.