జగన్ చెప్పిన చంద్రబాబు....‘పెద్దపులి’ కథ

జగన్ చెప్పిన చంద్రబాబు....‘పెద్దపులి’ కథ

ప్రజాసంకల్పయాత్రలో భాగంగా చిత్తూరు జిల్లాలోని కలికిరి వద్ద నిర్వహించిన బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చంద్రబాబునాయుడును ఉద్దేశించి ‘పెద్ద పులి’ కథ చెప్పారు. జగన్ మాటల్లోనే కథ ఈ క్రింది విధంగా ఉంది.

అనగనగా ఓ పెద్ద పులి. అది అడవిలో ఉండేది. అడవిలోని జంతువులను అది మోసం చేసేది. అబద్ధాలు చెప్పేది. చాలా క్రూరంగా ప్రవర్తించేది. కనిపించిన జనాలను, జంతువులను వేటాడి తినేది. ఆ పులి చేస్తున్న అన్యాయాలను, మోసాలను,  వేటను తట్టుకోలేక అక్కడున్న ప్రజలు దాన్ని అడవిలో నుంచి తరిమేశారు.

అలా తొమ్మిదేళ్ల పాటు ఆ పులి అడవికి దూరమైపోయింది. ఇంచుమించి చంద్రబాబుని ప్రజలు ఏ విధంగా తొమ్మిదేళ్ల పాటు పదవి నుంచి తప్పించారో అలా. తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ ఆ పులి మళ్ళీ అడవిలోకి వచ్చింది. అలా అడవిలోకి వచ్చిన పులిని ప్రజలు నమ్మకుండా దూరంగా పెట్టారు. అదే సమయంలో పులి వయసు కూడా పెరిగిపోయింది. 

పులికి ఇంచుమించుగా 70 ఏళ్లు వచ్చాయి. ఇక వేటాడే సామర్ధ్యం తనకు లేదని ఆ పులికి అర్థమైంది. అలా అర్థమైన మరుక్షణమే ఓ మనిషిని చంపేసి, అతని వద్ద ఉన్న బంగారు కంకణాన్ని తీసుకుంది. దాంతో ఊరి చివర ఉన్న చెరువు కట్టకు ఓ వైపు కూర్చుంది. దారిన పోయే వారితో ‘అయ్యా నేను మారిపోయాను’ అని చెప్పుకునేది.

‘నన్ను ఆదరించండి, నా దగ్గరున్న బంగారు కడియాన్ని తీసుకోండి’ అనేది. ‘ముసలి వయస్సులో దీన్ని నేనేం చేసుకోవాలి’ అంటూనే ‘దీన్ని మీరే తీసుకోండి’ అని ఎవరికి వారికే చెప్పేది. మొదట్లో ప్రజలు ఎవరూ పులిని నమ్మలేదు. కొంతకాలానికి పులిని చేతిలోని బంగారు కంకణాన్ని చూసి చూసి ప్రజలకు ఆశ కలిగింది.

తాను మారిపోయాను అంటోంది కదా అనుకుని బంగారు కంకణం కోసం దగ్గరికి వెళ్లిన వాళ్ళను మళ్ళీ చంపి  పులి తినేయడం మొదలుపెట్టింది. ఇంచుమించుగా ఇదే రీతిలోనే మన చంద్రబాబు నాయుడు కూడా. నేను మారాను అని ప్రజలతో అన్నారు. ప్రజలంతా ఈయన నిజంగానే మారాడేమో అనుకున్నారు. కానీ నమ్మి అధికారం అప్పగించిన తర్వాత చంద్రబాబు పులి లాగే తన నిజస్వరూపాన్ని చూపటం మొదలుపెట్టారంటూ కథను జగన్ ముగించారు.

 

 

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Andhra Pradesh

Next page