శ్రీకాకుళం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. బుధవారంతో పాదయాత్ర ముగుస్తున్న నేపత్యంలో రాత్రి 10 గంటలకు శ్రీకాకుళం నుంచి ట్రైన్ లో తిరుపతి వెళ్లనున్నారు. 

గురువారం ఉదయం 10.10 గంటలకు రేణిగుంంట రైల్వే స్టేషన్ కి చేరుకుని అక్కడ నుంచి రోడ్డు మార్గాన 11 గంటలకు తిరుపతి పద్మావతి అతిథి గృహానికి చేరుకుంటారు. మధ్యాహ్నాం ఒంటి గంటకు బయలు దేరి రోడ్డు మార్గాన తిరుమల అలిపిరి మెట్ల మార్గం గుండా కాలినడకన సాయంత్రం 5.30 నిమిషాలకు తిరుమల చేరుకుంటారు. 

స్వామి వారిని దర్శించుకున్న తర్వాత తిరుమలలోనే బస చేస్తారు. జనవరి 11 ఉదయం 6గంటలకు జగన్ రోడ్డు మార్గాన కడప జిల్లా ఇడుపుల పాయకు బయల్దేరతారు. మార్గమధ్యలో రాజంపేట, రైల్వే కోడుమూరులలో వివిధ కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంది. 

ఇకపోతే వైఎస్ జగన్ పాదయాత్ర చేపట్టే ముందు 2017 నవంబర్ 3న తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మూడు రోజుల విరామం అనంతరం నవంబర్ 6న జగన్ ప్రజా సంకల్పయాత్రకు  శ్రీకారం చుట్టారు. పాదయాత్ర విజయవంతం కావడంతో జగన్ శ్రీవారికి మెుక్కులు చెల్లించుకోనున్నారు.