అమరావతి: ముఖ్యమంత్రిగా నెలకు రూపాయి జీతం మాత్రమే తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఆయన రేపు గురువారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న విషయం తెలిసిందే. 

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని వేతనంగా ఒక్క రూపాయి మాత్రమే తీసుకోవాలని జగన్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క రూపాయి మాత్రమే వేతనంగా తీసుకున్నారు. ఆ తర్వాత మళ్లీ జగన్ ఎన్టీఆర్ ను అనుసరించబోతున్నారు. 

ప్రస్తుతం ముఖ్యమంత్రి వేతనం నెలకు రెండున్నర లక్షల రూపాయలు ఉంది. జీతం, ఇతర అలవెన్సులు అన్నీ కలిపితే ముఖ్యమంత్రికి నాలుగైదు లక్షల దాకా ముడుతుంది. 

జగన్ బాటలోనే కొందరు శాసనసభ్యులు, మంత్రులు నడిచే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మంత్రులకు కూడా ముఖ్యమంత్రితో సమానంగా రెండున్నర లక్షల వేతనం, ఇతర అలవెన్సులు వస్తున్నాయి. 

జగన్ ఐదేళ్ల పాటు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా తనకు ప్రభుత్వ వసతి గృహం వద్దని చెప్పారు. భారీగా అద్దెలు చెల్లించి తనకు వసతి గృహం ఇవ్వవద్దని ఆయన సూచించారు.