వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటి వరకు ప్రజల మద్యే గడిపిన వైఎస్ జగన్ ఆ తర్వాత ఏం చెయ్యబోతున్నారు అంటూ సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.
విజయవాడ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటి వరకు ప్రజల మద్యే గడిపిన వైఎస్ జగన్ ఆ తర్వాత ఏం చెయ్యబోతున్నారు అంటూ సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.
జనవరి 9న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో జగన్ పాదయాత్ర ముగియనుంది. పాదయాత్ర ముగింపు సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. అయితే ఈ బహిరంగ సభలో జగన్ కీలక నిర్ణయాలు ప్రకటిస్తారంటూ ప్రచారం జరుగుతుంది.
తెలంగాణలో రెండు నెలల ముందే అభ్యర్థులను ప్రకటించి కేసీఆర్ విజయం సాధించిన నేపథ్యంలో జనవరి 9న వైఎస్ జగన్ మెుదటి అభ్యర్థుల జాబితా విడుదల చెయ్యబోతున్నారని ప్రచారం జరుగుతోంది.
మెుదటి విడతలో భాగంగా 52 మంది అభ్యర్థులను ప్రకటించనున్నారని వారిలో 30 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారంటూ జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అలాగే 10 మంది ఎంపీ అభ్యర్థులను కూడాప్రకటిస్తారంటూ ప్రచారం జరుగుతుంది.
ఇప్పటికే అన్ని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలకు, ఎమ్మెల్యేలకు, మాజీ ఎంపీలకు, కీలక నేతలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాచారం అందించింది. ఎన్నికల ప్రచారానికి సమరశంఖారావం పూరించేలా ముగింపు సభను నిర్వహించాలని జగన్ అండ్ టీం ఆలోచిస్తోంది.
అయితే జగన్ ముగింపు సభలో కీలక నిర్ణయం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఏ హామీ అయితే ఆచరణ సాధ్యం కాదని చెప్పి అధికారానికి దూరమయ్యారో అదే హామీని ఇచ్చేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రజా సంకల్పయాత్ర ముగింపు సందర్భంగా ఆశేష జనవాహిని సమక్షంలో రైతు రుణమాఫీ పథకాన్ని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు రైతు రుణమాఫీ ప్రకటించారు. అయితే వైఎస్ జగన్ మాత్రం అది అసాధ్యమంటూ ప్రకటించలేదు. దీంతో ఆయన అధికారానికి దూరమయ్యారు.
ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, వైఎస్ జగన్ అనేక సందర్భాల్లో రైతు రుణమాఫీ ఎందుకు ప్రకటించలేదే అని మదనపడిన సందర్భాలు లేకపోలేదట. జగన్ నేరుగా కూడా చెప్పుకొచ్చారు. ఫలితంగా 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులను ఆకట్టుకోలేకపోయిందని వైసీపీ అధినేత జగన్ భావిస్తున్నారట.
గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 2శాతం ఓట్లతో అంటే 5 లక్షల ఓట్లతోనే ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో అలాంటి పునరావృతం కాకుండా ఉండేందుకు ఏ హామీతో అయితే అధికారానికి దూరమయ్యామో అదే హామీతో అధికారంలోకి రావాలని వైఎస్ జగన్ భావిస్తున్నారు.
ఇప్పటికే ప్రజా సంకల్పయాత్రలో రైతులతో అనేక సందర్భాల్లో వైఎస్ జగన్ ముచ్చటించారు. జగన్ పాదయాత్రలో ఉండగానే తిత్లీ, గజ, పెథాయ్ తుఫాన్ లు సంభవించాయి. ప్రకృతి భీభత్సం వల్ల రైతన్న నష్టాన్ని కల్లారా చూసిన వైఎస్ జగన్ ఈ రైతు రుణమాఫీ పథకాన్ని అమలు చెయ్యాలని భావిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన పథకాలు నవరత్నాలు. నవరత్నాల్లో రైతుకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు వైఎస్ జగన్. వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద 5ఎకరాలలోపు ఉన్న ప్రతీ రైతు కుటుంబానికి మే నెలలో పెట్టుబడి కోసం రూ.12,500 ఇచ్చేలా రూపొందించారు. ఇలా నాలుగు పర్యాయాలు మెుత్తం రూ.50వేలు అందిచనుంది.
అంతేకాదు రైతన్నలకి వడ్డీలేని రుణాలు. ఉచితంగా బోర్లు వేయించడంతోపాటు వ్యవసాయానికి పగటి పూటే 9గంటలు ఉచిత కరెంట్, ఆక్వా రైతులకు కరెంట్ చార్జీలు యూనిట్ కు రూ.1.50కి తగ్గింపు. రూ.3000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు, రూ.4000 కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయక నిధి ఏర్పాటు వంటి కార్యక్రమాలను ఏర్పాటు చెయ్యనున్నారు.
ప్రతి నియోజకవర్గంలో శీతలీకరణ గిడ్డంగులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు, మొదటి ఏడాది సహకార రంగాన్ని పునరుద్ధరించడం వంటి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వైసీపీ ప్రకటించింది. రెండవ ఏడాది నుంచి సహకార డెయిరీకి పాలు పోసే ప్రతి పాడి రైతుకు లీటరుకు 4 రూపాయలు సబ్సిడీ ఇచ్చేలా నిర్ణయం
వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్ టాక్స్ రద్దు చెయ్యడంతోపాటు ప్రమాదవశాత్తు లేదా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి వైఎస్ఆర్ భీమా ద్యారా రూ . 5లక్షలు ఇచ్చి ఆదుకునేలా నవరత్నాలలో పొందుపరిచింది. అంతే కాదు ఆ డబ్బును అప్పలవాళ్ళకు చెందకుండా అసెంబ్లీలో చట్టాన్ని తీసుకువచ్చి ఆ రైతు కుటుంబానికి అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది.
