శ్రీకాకుళం: 2019 సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాలకు పదును పెడుతున్నారు. గత ఎన్నికల్లో ఎదురైన అనుభవావలను, తెలంగాణ ముందస్తు ఎన్నికలను ఆసక్తిగా గమనించిన జగన్ ఎన్నికల సమరంలో పాల్గొనేందుకు అస్త్రసస్త్రాలను రెడీ చేసుకునే పనిలో పడ్డారు. 

ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఉత్సాహం నింపేందుకు వైఎస్ జగన్ ఏడాది క్రితం చేపట్టిన బృహత్తర కార్యక్రమం ప్రజా సంకల్పయాత్ర. 2017 నవంబర్ 6న కడప జిల్లా ఇడుపులపాయ వద్ద ప్రారంభించిన ఈ పాదయాత్ర ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతుంది. 

జగన్ ఊహించినట్లుగానే ప్రజా సంకల్ప యాత్ర ఆ పార్టీకి మైలేజ్ తీసుకువచ్చిందనే చెప్పాలి. జగన్ పాదయాత్ర చేపట్టకముందు పార్టీ నేతలు గందరగోళానికి గురయ్యారు. దాదాపు 23 మంది ఎమ్మెల్యేలు పార్టీ వీడటంతో పార్టీలో విపత్కర పరిస్థితి నెలకొంది. ఇలాంటి సమయంలో జగన్ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.

అయితే ఈ పాదయాత్ర రాష్ట్రంలో 13వ జిల్లా అయిన శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతుంది. శ్రీకాకుళం జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాల్లో జగన్ పాదయాత్ర పూర్తి చేశారు. ఇక మిగిలినవి, పలాస, ఇచ్చాపురం నియోజకవర్గాలు మాత్రమే. అయితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైఎస్ జగన్ పాదయాత్రను త్వరగా ముగించాలని యోచిస్తున్నారు.

ఇప్పటి వరకు దాదాపు 14 నెలలు పాదయాత్ర చేసి నిత్యం ప్రజల మధ్యే గడిపారు వైఎస్ జగన్. అయితే ఫిబ్రవరి నెలలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉండటంతో పార్టీ వ్యవహారాలు, టిక్కెట్ కేటాయింపులు, ఎన్నికల ప్రచారం వంటి అంశాలపై దృష్టిసారించాల్సిన సమయం ఆసన్నమవ్వడంతో ఇక పాదయాత్రను ముగించాలని నిర్ణయించారు.

ఇప్పటికే పాదయాత్రను వేగం పెంచారు జగన్. అందులో భాగంగానే పాదయాత్రను పరుగులు పెట్టిస్తున్నారు. అయితే సంక్రాంతికి ముందే కొత్త సంవత్సరంలో పాదయాత్రను క్లోజ్ చెయ్యాలని భావిస్తున్నట్లు సమాచారం. 

జనవరి 9 లేదా జనవరి 10న పాదయాత్రను ముగించాలని జగన్ అండ్ టీం భావిస్తున్నారు. పాదయాత్ర ముగింపు సందర్భంగా ఇచ్చాపురం నియోజకవర్గంలో భారీ పైలాన్ ఆవిష్కరణకు వైసీపీ జిల్లా నాయకత్వం ప్రయత్నాలు చేస్తోంది. 

అలాగే అదే రోజు భారీ ముగింపు సభను నిర్వహించాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ భారీ బహిరంగ సభే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించేలా ఉంటుందని ప్రచారం జరుగుతుంది. 

ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఆయా నియోజకవర్గాల ఇంచార్జ్ లకు, పార్లమెంట్ నియోజకవర్గాల ఇంచార్జ్ లకు, పార్టీ కీలక నేతలకు సమాచారం అందించినట్లు కూడా తెలుస్తోంది. అంతాు ఇచ్చాపురం బహిరంగ సభకు హాజరుకావాలని సందేశం పంపినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.

అయితే ఫిబ్రవరి రెండోవారంలో ఎన్నికల నోటిపికేషన్ వెలువడే అవకాశం ఉందని లీకులు రావడంతో జగన్ అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. ఎన్నికల సమరంలోకి దూకేందుకు అడుగు ముందుకు వేసినట్లు తెలుస్తోంది.  

ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సంక్రాంతి తర్వాత అభ్యర్థులను ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ సంక్రాంతికంటే ముందు అంటే పాదయాత్ర ముగింపు సభలోనే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

ముగింపు సభ వేదికగా అసెంబ్లీ స్థానాలతో పాటు, ఎంపీ సీట్లకు కూడా అభ్య‌ర్ధుల‌ పేర్ల‌ను ప్ర‌క‌టించ‌బోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎన్నిక‌లు షెడ్యూల్ ప్ర‌కారం ఏప్రిల్ నెల‌లో ఎన్నిక‌లు జ‌రిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పార్టీ త‌ర‌పున పోటీ చేసే అభ్య‌ర్థుల సంబంధించి తొలి జాబితా విడుద‌ల చేసేందుకు సిద్ద‌మైనట్లు కనిపిస్తోంది.  
 
ముగింపు సభరోజు నవరత్నాలతోపాటు మినీ మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కేసీఆర్ మూడు నెలల ముందు అభ్యర్థులను ప్రకటించి విజయజవంతమయ్యారు. ఇదే సెంటిమెంట్ ను వైఎస్ జగన్ ఫాలో అవుతున్నారని సమాచారం. 

 ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీంతోపాటు సొంత టీం సర్వే, ఇతర ప్రైవేట్ సర్వేలు చేయించుకున్న వైఎస్ జగన్ ఆ నివేదికల ఆధారంగా ఓ లిస్ట్ ఫైనల్ చేశారని తెలుస్తోంది. దాదాపు 100మంది అభ్యర్థులను ఫైనల్ చేసినట్లు సమాచారం. 

ఏపీలో మెుత్తం 175 అసెంబ్లీ స్థానాల‌కు గాను తొలివిడత జాబితాలో 100 మంది అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల సమరానికి శంఖారావం పూరించనున్నట్లు తెలుస్తోంది. అలాగే 25 పార్ల‌మెంట్ స్థానాల‌కు గాను 10 నుంచి 15 ఎంపీ అభ్య‌ర్థుల పేర్లు కూడా ప్రకటించనున్నట్లు సమాచారం. 

అసెంబ్లీ అభ్యర్థుల మెుదటి జాబితాలో 30 మంది వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండగా మిగిలిన వారు ఆయా నియోజకవర్గ అభ్యర్థులు ఉన్నారు. ఇకపోతే తొలిజాబితాలో టీడీపీ మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోని అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. అలాగే ఫిరాయింపు ఎమ్మెల్యేల స్థానాల్లోనూ అభ్యర్థులను తొలిజాబితాలోనే ప్రకటించాలని జగన్ ఉన్నట్లు ప్రచారం. 

ఇక జగన్ ప్రకటించబోయే నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, సామాజిక స‌మీక‌ర‌ణాలు పోటీలో ఉన్న అభ్య‌ర్ధులు పరిస్థితి వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ఎంపిక చెయ్యనున్నట్లు తెలిసింది. అభ్యర్థులకు సంబంధించి పలు అంశాలపై జ‌గ‌న్ ప‌లు కోణాల్లో స‌ర్వేలు చేయించిన తర్వాతే ఫైనల్ లిస్ట్ తయారు చేసినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. 

ఆ స‌ర్వేల్లో వ‌చ్చిన ఫ‌లితాల ఆధారంగానే కొన్ని చోట్ల పార్టీ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ల‌ను మార్చక తప్పని పరిస్థితి. సమన్వయ కర్తల మార్పు కొన్ని నియోజకవర్గాల్లో వివాదాలకు దారితీసినా జగన్ వెనకడుగు వెయ్యలేదు. గతంలో మెుహమాటాలకు పోయి టిక్కెట్లు ఇచ్చి అధికారాన్ని కోల్పోయామని భావిస్తున్న జగన్ ఈసారి గెలుపుగుర్రాలనే బరిలోకి దింపాలని యోచిస్తున్నారు.  

అయితే తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలో చేరేందుకు పలువురు కీలక నేతలు జగన్ తో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారి రాకకు సంబంధించి కొన్ని నియోజకవర్గాలను పెండింగ్ లో పెట్టారని తెలుస్తోంది. 

మెుత్తానికి జ‌గ‌న్ ఇచ్చాపురం వేదిక‌గా అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టించి భవిష్యత్ కార్యాచ‌ర‌ణ ఖ‌రారు చెయ్యడం ఖాయమనిపిస్తోంది. దీంతో ఎవరికి టిక్కెట్ దక్కుతుందోనని ఆశావాహులు ఫుల్ టెన్షన్ లో ఉన్నారు. 

ముగింపు సభ పూర్తైన తర్వాత వైఎస్ జగన్ ఇచ్చాపురం నుంచి తిరుపతికి వెళ్తారని తెలుస్తోంది. కాలినడకన తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకుంటారు. ఆ తర్వాత కడప చేరుకుని కడప దర్గాలో ప్రార్థనల్లో పాల్గొంటారు. అక్కడ నుంచి నేరుగా ఇడుపులపాయ చేరుకుంటారని ప్రచారం. 

అభ్యర్థుల ప్రకటన పూర్తైన తర్వాత జగన్ 5 రోజులపాటు విదేశాలకు వెళ్లే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతుంది. ఇజ్రాయేల్ వెళ్లే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.