Asianet News TeluguAsianet News Telugu

నేడు కుప్పంలో జగన్ పర్యటన.. మూడో విడత వైయస్సార్ చేయూత ప్రారంభించనున్న సీఎం...

వైఎస్సార్ చేయూత పథకం మూడో విడత ప్రారంభోత్సవానికి గానూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు కుప్పం రానున్నారు. ఈ నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

YS Jagan to launch 3rd phase of YSR Cheyutha in Kuppam today
Author
First Published Sep 23, 2022, 6:41 AM IST

కుప్పం : ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలిసారిగా చిత్తూరు జిల్లా కుప్పం వస్తుండటంతో పోలీసులు పట్టణాన్ని అష్టదిగ్బంధనం చేశారు. మూడో విడత వైయస్సార్ చేయూత కార్యక్రమాన్నిప్రారంభించడానికి ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పానికి శుక్రవారం వస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేనంతగా 2,500 మందివరకు పోలీసు సిబ్బంది పట్టణంలో అడుగడుగునా మోహరించారు. ముఖ్యమంత్రి కోసం గురువారం కొద్దిసేపు చెరువుకట్ట వద్ద వాహనాలు నిలిపివేయడంతో సామాన్యులకు ఇబ్బందులు తప్పలేదు. 

పట్టణ సమీపంలోని హెలిప్యాడ్ నుంచి సభా ప్రాంగణం వరకు రోడ్డును మధ్యలో తవ్వి బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పట్టణంలో రాకపోకలు సాగించే వాహనదారులకు అవస్థలు పడ్డారు. మరో వైపు వెళ్లేందుకు దారి లేక రెండు రోజులుగా వ్యాపారాలు సరిగా లేవని వ్యాపారులు వాపోతున్నారు. జగన్ వెళ్ళాక రోడ్డు మధ్యలో ఉన్న గుంతలను ఎవరు పూడుస్తారో అనే చర్చ పట్టణంలో సాగుతోంది. హెలిప్యాడ్ నుంచి సుమారు నాలుగు కిలోమీటర్ల మేర బ్యానర్లు ఫ్లెక్సీలను వైసీపీ శ్రేణులు ఏర్పాటు చేశాయి. 

ఇళ్ల నిర్మాణంలో నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలి: అధికారులకు సీఎం జగన్ ఆదేశం

సీఎం సభకు ప్రజలను తరలించేందుకు ప్రైవేటు బస్సులు ఇవ్వాలంటూ ఆ పార్టీ నాయకులు ముందుగానే మాట్లాడుకున్నారు. గురు, శుక్రవారాలు కుప్పం మండలంలోని ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. కుప్పం పట్టణంలోని అనిమిగానిపల్లె సమీపంలో వైయస్సార్ చేయూత ప్రారంభోత్సవాన్ని ముఖ్యమంత్రి జగన్ నిర్వహించనున్నారు. చెరువు కట్ట నుంచి బస్టాండ్, క్రిష్ణగిరి బైపాస్ మీదుగా అనిమిగానిపల్లె వరకు సీఎం కాన్వాయ్ వెళ్లనుంది. ఈ రహదారి వెంట ఉన్న దుకాణదారుల,ఇళ్ల  వివరాలను వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది సహాయంతో పోలీసులు సేకరించారు. వారి పేర్లు, ఫోన్ ఫోన్ నెంబర్లు దుకాణంలో ఎవరెవరు ఉంటారని తెలుసుకున్నారు.

మీ ఇళ్లపై నుంచి  కాన్వాయ్ పై ఏమైనా పడితే  మీరే బాధ్యత వహించాలని చెప్పారు. కొందరు సిబ్బంది ఓ అడుగు ముందుకు వేసి దుకాణాలు మూసేస్తే మీకే మంచిది అంటూ హెచ్చరికతో కూడిన సూచనలు ఇచ్చారు. దీంతో శుక్రవారం తాము దుకాణాల తెరవమంటూ వారు సమాధానమిచ్చారు. సీఎం జగన్ పర్యటన సందర్భంగా ఆటంకాలు తలెత్తకుండా ఉండేందుకు పోలీసులు ముందస్తుగా ఇప్పటికే కేసులు నమోదైన టిడిపి నాయకులు, కార్యకర్తలకు సమన్లు ఇచ్చారు. విజయపురం, కార్వేటినగరం మండలాల తహసీల్దార్ల ముందు గురువారంవారు హాజరయ్యారు. దీనికి తోడు నియోజకవర్గంలో క్రియాశీలంగా ఉన్న టీడీపీ కార్యకర్తలను గురువారం ఉదయం నుంచే గృహ నిర్బంధంలో ఉంచారు.

Follow Us:
Download App:
  • android
  • ios