అమరావతి: తనకు కంటగింపుగా తయారైన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అధికారాలను నియంత్రించడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అడుగులు వేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. కేంద్ర ఎన్నికల కమిషన్ తరహాలో రాష్ట్ర ఎన్నికల సంఘంలో కూడా ముగ్గురు కమిషనర్లను నియమించే దిశగా జగన్ ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. 

స్థానిక సంస్థల ఎన్నికలను రమేష్ కుమార్ వాయిదా వేయడం ఆయనకు మింగుడు పడడం లేదు. రమేష్ కుమార్ మీద జగన్ వ్యక్తిగత విమర్శలకు దిగారు. మంత్రివర్గ సహచరులే కాకుండా శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్ కూడా ఆయనపై వ్యక్తిగత దూషణలకు దిగారు. ఆయన నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది. 

Also Read: నిమ్మగడ్డ రమేష్ కుమారైనా తప్పించుకోలేరు: విజయసాయి రెడ్డి

సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్ నిర్ణయాన్నే సమర్థించింది. దాంతో ఆయనను ఆ పదవి నుంచి తప్పించే ఉద్దేశం జగన్ కు ఉన్నట్లు చెబుతున్నారు. రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్, రిటైర్డ్ ఐఎఎస్ రమాకాంత్ రెడ్డితో జగన్ ఆ విషయంపై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. హైకోర్టు న్యాయమూర్తి హోదాలో ఉన్న ఎన్నికల కమిషనర్ ను అభిశంసన ద్వారా తప్ప తొలగించడానికి సాధ్యం కాదు. అది నిర్ధారణ కావడంతో ఆయన అధికారాలపై కోత పెట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

కేంద్ర ఎన్నికల సంఘంలో మాదిరిగా ముగ్గురు కమిషనర్లను నియమించాలని ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశాలు లేవు. దీంతో ఈలోగా ఈసీ అధికారాలకు కోత పెడుతూ ఆర్డినెన్స్ తేవాలని ఆయన ఆలోచనగా చెబుతున్నారు.

Also Read: తప్పుడు ప్రచారం చేస్తారా: ఈసి రమేష్ కుమార్ ను నిలదీసిన బుగ్గన

అయితే, అది సాధ్యం కాదని తెలుస్తోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం రాజ్యాంగంలోని 243 కే అధికరణ ప్రకారం ఏర్పాటైంది. దాన్ని తిసభ్య సంఘంగా మార్చాలంటే ఆ అధికరణను సవరించాల్సి ఉంటుంది. అందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించి, పార్లమెంటులో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఆ విషయంపై రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు కొందరు రాష్ట్ర గవర్నర్ ను కలిసి చర్చించినట్లు తెలుస్తోంది. ఆర్డినెన్స్ తెచ్చి స్థానిక ఎన్నికల ప్రక్రియను ముగించాలని వైఎస్ జగన్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.