విజయవాడ: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం బుధవారం నాడు జరగనుంది. పలు కీలక అంశాలపై కేబినెట్ లో చర్చ జరగనుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టే పలు బిల్లులకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలపనుంది.బుధవారం నాడు ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం ఏపీ సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన జరగనుంది. 

వైఎస్ఆర్ నవశకం మార్గదర్శకాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలపనుంది. వైఎస్ఆర్ నవశకం ద్వారా జనవరి 1వ తేదీ నుండి వివిధ రకాల సంక్షేమ కార్డులు అందజేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయమై కేబినెట్ లో చర్చించనున్నారు. 

మరోవైపు బియ్యం కార్డులు, పెన్షన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు, జగనన్న విద్యాదీవెన కార్డులను కూడ జారీ చేయాలని సర్కార్ తలపెట్టింది.ఈ కార్డులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది.

ఈ ఏడాది డిసెంబర్ 9వ తేదీ నుండి అసెంబ్లీ శీతాకాల బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాల్లో కీలక బిల్లులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. టీటీడీ పాలకమండలి సభ్యులను పెంచుతూ తీసుకున్న డ్రాఫ్ట్ బిల్లుకు ఆమోదం మంత్రివర్గం ఆమోదించనుంది.
పేదలకు ప్రభుత్వం ఇచ్చే భూముల యాజమాన్య హక్కుల చట్టంలో సవరణలపై క్యాబినెట్‌లో చర్చించనున్నారు.

అమరావతిలో చేపట్టాల్సిన ప్రొజెక్టులపైనా క్యాబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉంది. కడప జిల్లాలో ప్రారంభించే స్టీల్ ఫ్యాక్టరీపై కూడ మంత్రివర్గం చర్చించనుంది.
వైసీపీ ఆరు నెలల పాలన పై మంత్రివర్గంలో చర్చించనుంది.