ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక అసెంబ్లీలో అడుగుపెట్టదలుచుకోలేదా? అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేయాలని డిసైడ్ అయ్యారా? వైసీపీ వర్గాలు అవుననే అంటున్నాయ్. అందుకనే ఆరుమాసాల సుదీర్ఘ పాదయాత్రను జగన్ పెట్టుకున్నారని వైసీపీ వర్గాలంటున్నాయి.  నవంబర్ 2వ తేదీ నుండి ఆరుమాసాలంటే వచ్చే ఏడాది ఏప్రిల్ వరకూ జరుగుతుంది. ఎలాగూ ముందస్తు ఎన్నికలొస్తాయని ప్రచారం జరుగుతోంది. అంటే వచ్చే ఏడాది అక్టోబర్ నుండి డిసెంబర్ నెలలోగా ఎప్పుడైనా ముందస్తు ఎన్నికలొచ్చే అవకాశాలున్నాయి.

ముందస్తు ఎన్నికల సన్నాహాల్లో అన్నీ పార్టీలు ముణిగిపోయాయి. అందులో భాగంగానే అధికార టిడిపి, ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీలు కూడా స్పీడ్ పెంచాయి. అందుకనే జగన్ కూడా ఆరుమాసాల పాదయాత్రకు రెడీ అవుతున్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరైనా ప్రజా సమస్యలపై జరుగుతున్న చర్చ ఎటూ లేదు. అధికారపక్షం హోదాలో టిడిపి సభ్యులు జగన్ ను లక్ష్యంగా చేసుకుని అమ్మనాబూతులు తిడుతున్నారు. ఏ అంశంపైన కూడా జగన్ ను నోరెత్తనీయటం లేదు.

ఒకవేళ టిడిపిపై వైసీపీ సభ్యులు మాటలతో ఎదురుదాడి చేద్దామనుకున్నా వెంటనే సస్పెన్షన్ వేటు వేసేస్తున్నారు. అదికూడా ఏకపక్షంగా. రోజా విషయంలో ఏం జరిగిందో అందరూ చూసిందే. అదేవిధంగా ప్రత్యేకహోదాపై నినాదాలు చేసినందుకు ఏకంగా 18 మందిని సస్పెండ్ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇటువంటి పరిస్ధితుల్లో అసెంబ్లీకి వెళితే ఏంటి వెళ్ళకపోతే ఏంటనే ఆలోచన జగన్లో మొదలైందట. అసెంబ్లీకి వెళ్ళి టిడిపితో మాటలు పడేకంటే, ప్రజాక్షేత్రంలోకే వెళ్ళి తాను చెప్పదలుచుకుంది నేరుగా ప్రజలకే చెబితే ఎలాగుంటుందని చాలా కాలంగా జగన్ యోచించారు.

అదే విషయాన్ని పార్టీలోని సీనియర్ నేతలతో చర్చించినపుడు వారు కూడా జగన్ ఆలోచనలకే మద్దతు పలికారట. ప్రజలను కలుసుకోవాలంటే పాదయాత్ర ఒక్కటే మార్గంగా జగన్ నిర్ణయించుకున్నారు. అందుకనే అసెంబ్లీని బాయ్ కాట్ చేసి ఆరుమాసాల పాదయాత్రకు సిద్ధపడ్డారు.  అయితే ఇదే విషయాన్ని జగన్ త్వరలో ప్రకటిస్తారని అని సమాచారం. అసెంబ్లీకి వచ్చి అక్కడే ప్రకటిస్తారా లేక పాదయాత్రలోనే ఎక్కడైనా ప్రకటిస్తానా అన్నదే సస్పెన్స్. అందుకనే జగన్ కానీ వైసీపీ సభ్యులు కానీ వచ్చే ఎన్నికల్లోగా అసెంబ్లీకి హాజరయ్యేది అనుమానమే అన్నది వైసీపీ వర్గాల మాట.