అమరావతి: ఆంధ్రప్రదేశ్ బిజెపిలో రాజధానిపై నెలకొన్న విభేదాలు చూస్తుంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఊరట లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజధాని విషయంలో జోక్యం చేసుకోవాలని బిజెపి రాష్ట్ర కోర్ కమిటీ తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని నిర్ణయించింది. దీనివల్ల కేంద్రం జోక్యం చేసుకుంటుందని, వైఎస్ జగన్ కు చిక్కులు తప్పవని భావించారు. 

కానీ, సమావేశానంతరం రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆ తీర్మానానికి ట్విస్ట్ ఇచ్చారు. తాము చేసింది రాజకీయ తీర్మానం మాత్రమేనని, కేంద్రానికి దాంతో సంబంధం లేదని జీవీఎల్ చెప్పారు. దీన్నిబట్టి కేంద్రం జోక్యం చేసుకుంటుందా అనేది అనుమానాస్పదంగానే ఉంది. 

Also Read:జగన్ కు అమరావతి షాక్: రంగంలోకి కేంద్రం

రాజధానిపై వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయంపై బిజెపిలో విభేదాలు చోటు చేసుకున్నాయి. ఓ వర్గం అమరావతిలోనే రాజధాని కొనసాగాలని పట్టుబట్టగా, మరో వర్గం దాన్ని వ్యతిరేకిస్తూ కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని వాదించింది. అమరావతిలోనే కొనసాగించాలనే వాదన చేస్తున్నవారు టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి సన్నిహితులు కాగా, వ్యతిరేకిస్తున్నవారు అందుకు భిన్నమైనవారు.

రాజధాని అమరావతిలోనే కొనసాగేలా కేంద్రం జోక్యం చేసుకోవాలని టీడీపీకి రాజీనామా చేసి బిజెపిలో చేరిన సుజనా చౌదరి, సీఎం రమేష్ ఉన్నారు. వీరిద్దరు కూడా చంద్రబాబు కోసమే బిజెపిలో చేరారని గిట్టనివారు విమర్శిస్తున్న విషయం తెలిసిందే. వారికి పురంధేశ్వరి, కన్నా లక్ష్మినారాయణ మద్దతుగా నిలిచారు.

Also ReadL కేంద్రం చూస్తూ ఊరుకోదు: అమరావతిపై జగన్ సుజనా హెచ్చరిక

కన్నా లక్ష్మినారాయణ మద్దతు ఇవ్వడానికి కారణాలు ప్రత్యేకంగా ఉండే అవకాశం ఉంది. చంద్రబాబును తీవ్రంగా వ్యతిరేకించే కన్నా ఆ వాదనకు మద్దతు నిలవడం ఆశ్చర్యమే కానీ, ఆయన గుంటూరు జిల్లాకు చెందినవారు కావడాన్ని ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. తన ప్రాంతంలో రాజధాని ఉండాలని ఆయన కోరుకోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. 

పురంధేశ్వరికి కూడా అటువంటి కారణాలే ఉండే అవకాశం ఉంది. ఆమె సొంత జిల్లా ప్రకాశం. ఆ జిల్లాకు అమరావతి సమీపంగా ఉంటుంది. కన్నా తప్ప మిగతా వారంతా ఒకే సామాజికవర్గానికి చెందినవారనే విషయాన్ని కూడా గుర్తించాల్సి ఉంటుంది.

కాగా, వారితో రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు, సోము వీర్రాజు విభేదించారు. సోము వీర్రాజు మొదటి నుంచి చంద్రబాబును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మొత్తంగా సుజనా చౌదరి తన నిర్ణయాన్ని సమావేశంలో ఆమోదింపజేసుకున్నారు.