హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి ప్రతిపక్ష హోదాను గల్లంతు చేసే వ్యూహాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ రచించి అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆరుగురు టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తే చంద్రబాబు ప్రతిపక్ష హోదా గల్లంతవుతుంది. ఇప్పటికే వల్లభనేని వంశీ తన రాజీనామా లేఖను చంద్రబాబుకు పంపించారు. 

వల్లభనేని వంశీ తన రాజీనామా లేఖను స్పీకర్ తమ్మినేని సీతారాంకు పంపిస్తే ఇక జగన్ కు కావాల్సింది ఐదుగురు ఎమ్మెల్యేల రాజీనామాలు మాత్రమే. బలహీనతలు ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలపై గురి పెట్టి వారి చేత రాజీనామా చేయించే దిశగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఆ ఆరు స్థానాలకు ఉప ఎన్నికలను ఆహ్వానించి తమ ఖాతాలో వేసుకునే ఆలోచన జగన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read: చంద్రబాబుకు భారీ షాక్: జగన్ షరతులకు బ్రేక్, టీడీపీ ఎమ్మెల్యేల ప్లాన్.

ఆంధ్రప్రదేశ్ శాసనసభలోని 175 స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెసు 151 స్థానాలను గెలుచుకుంది. టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలున్నారు. ప్రతిపక్ష హోదాకు పది శాతం మంది ఎమ్మెల్యేలు ఉండాలని. అంటే టీడీపీకి కనీసం 18 మంది ఎమ్మెల్యేలు ఉంటే సరిపోతుంది. చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగుతారు.

ప్రతిపక్ష నేతకు క్యాబినెట్ హోదా ఉంటుంది. కేబినెట్ మంత్రికి ఉండే సౌకర్యాలన్నీ ఉంటాయి. శాసనసభలో ప్రతిపక్షానికి కేటాయించే గదులు, సౌకర్యాలు వేరుగా ఉంటాయి. ఇతర ప్రతిపక్షాలకు తక్కువగా ఉంటాయి. టీడీపీ ప్రతిపక్ష హోదాను గల్లంతు చేస్తే చంద్రబాబు సౌకర్యాలు మాత్రమే కాకుండా టీడీపీ సౌకర్యాలు కూడా గల్లంతవుతాయి. 

చంద్రబాబుకు ప్రతిపక్ష నేత హోదా లేకుండా చేయాలంటే ఆరుగురు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాల్సి ఉంటుంది. ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేయకుండా పార్టీ మారితే ఫిరాయింపుల నిరోధక చట్టం కింద స్పీకర్ వారిని అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉంది. దాంతో బలహీనతనలు ఉన్న ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు సిద్ధపడవచ్చునని భావిస్తున్నారు. 

Also Read: ఇద్దరూ ఎన్టీఆర్ ఫ్యాన్స్: జగన్‌తో వల్లభనేని వంశీ భేటీ వెనుక నాని..

గత ఐదు నెలల కాలంలో జగన్ ప్రభుత్వానికి ఇసుక కొరత. పీపీఎల రద్దు వంటి సమస్యలు ఎదురయ్యాయి. ఆర్థిక పరిస్థితి అంత సజావుగా లేదు. దీంతో కొంత మేరకు జగన్ ప్రభుత్వంపై అసంతృప్తి ఏర్పడిందని అంటున్నారు. దీంతో తమకు వ్యతిరేకత లేదని నిరూపించుకోవడానికి ఆరు స్థానాలకు ఉప ఎన్నికలు జరిగేలా చూసుకోవాలని వైఎస్ జగన్ భావిస్తున్నట్లు సమాచారం. ఉప ఎన్నికల ఫలితాలు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి కాబట్టి తాము గెలవడం సులభమవుతుందని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. 

వల్లభనేని వంశీ విషయంలో అనుసరించిన వ్యూహాన్నే మరో ఐదుగురు టీడీపీ శాసనసభ్యుల పట్ల అనుసరించాలని వైఎస్సార్ కాంగ్రెసు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అది జరిగితే గనుక చంద్రబాబు బలహీనపడుతారని కూడా భావిస్తున్నారు.