అమరావతి: గన్నవరం ఎమ్మెల్యే, టీడీపీ నేతల వల్లభనేని వంశీ వైసీపీలో చేరుతారా, ఏపీ సీఎం వైఎస్ ‌జగన్‌ను వంశీ కలవడంతో ఏపీ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. జూనియర్ ఎన్టీఆర్‌తో వల్లభనేని వంశీకి మంచి అనుబందం ఉంది. జూనియర్ ఎన్టీఆర్‌తో సాన్నిహిత్యం ఉన్న కొడాలి నాని టీడీపీని వీడి వైసీపీలో చేరారు. ప్రస్తుతం కొడాలి నాని జగన్ మంత్రి వర్గంలో కేబినెట్ మంత్రిగా కొనసాగుతున్నారు.

Also Read:టీడీపీ నుంచి చాలా మంది వస్తారు: వంశీ భేటీపై సుజనా క్లారిటీ

కృష్ణా జిల్లాలో టీడీపీకి మంచి పట్టుంది. 2009 ఎన్నికల్లో గన్నవరం అసెంబ్లీ స్థానం నుండి వల్లభనేని వంశీ టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసేందుకు రంగం సిద్దం చేసుకొన్నారు. కానీ, ఆ సమయంలో  దాసరి భాలవర్ధన్‌రావుకు టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు టిక్కెట్టు ఇవ్వాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో చంద్రబాబునాయుడు వల్లబనేని వంశీకి విజయవాడ ఎంపీ టిక్కెట్టు ఇచ్చాడు.

Also Read:బాబుకు షాక్..?: బీజేపీ ఎంపీతో టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ భేటీ

గన్నవరంలో దాసరి బాలవర్ధన్ రావు టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించాడు.వల్లభనేని వంశీ మాత్రం ఓటమి పాలయ్యాడు.వల్లభనేని వంశీ విజయవాడ పార్లమెంట్ ఇంచార్జీగా కొనసాగుతుండేవాడు. ఇదే జిల్లాకు చెందిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

వీరిద్దరూ కూడ జూనియర్ ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితులుగా ముద్రపడ్డారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన కొన్ని సినిమాలకు కొడాలి నాని, వల్లభనేని వంశీలు నిర్మాతలుగా వ్యవహరించారు.

Also Read:టీడీపీ నుంచి చాలా మంది వస్తారు: వంశీ భేటీపై సుజనా క్లారిటీ

2014 ఎన్నికలకు ముందు విజయవాడలో జగన్ ర్యాలీ సందర్భంగా బెంజీ సెంటర్‌లో  వైసీపీ చీఫ్ వైఎస్‌ జగన్‌ను, వల్లభనేని వంశీని ఆప్యాయంగా కౌగిలించుకొన్నారు.

ఆ సమయంలో ఈ విషయమై పెద్ద సంచలనంగా మారింది. ఆ సమయంలో అప్పటికే కొడాలి నాని వైసీపీలో చేరారు. అదే సమయంలో వల్లభనేని వంశీ కూడ పార్టీ మారుతారని ప్రచారం సాగింది.

కానీ, వల్లభనేని వంశీ మాత్రం పార్టీ మారలేదు. టీడీపీలోనే వల్లభనేని వంశీ ఉన్నారు. 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా గన్నవరం స్థానం నుండి  వల్లభనేని వంశీ పోటీ చేసి విజయం సాధించారు.

టీడీపీ నుండి వైసీపీలో చేరిన కొడాలి నాని 2014, 2019 ఎన్నికల్లో గుడివాడ నుండి విజయం సాధించారు. ప్రస్తుతం కొడాలి నానికి జగన్ మంత్రి పదవిని ఇచ్చారు.కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితుడు. జూనియర్ ఎన్టీఆర్  ఇంటర్ చదువుకొనే సమయంలో కొడాలి నాని వద్దే ఉన్నారు.

దివంగత నందమూరి హరికృష్ణను కొడాలి నాని తన రాజకీయ గురువుగా చెప్పుకొంటారు. ఏపీ రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో  చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కృష్ణా జిల్లాలో హరికృష్ణ స్మారక కార్యక్రమంలో కొడాలి నాని కూడ పాల్గొన్నారు.

అయితే కొడాలి నాని వైసీపీని వీడి టీడీపీలో చేరుతారా అనే చర్చ కూడ సాగింది. కానీ,  హరికృష్ణపై తనకు ఉన్న అభిమానంతోనే తాను ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టుగా కొడాలి నాని ఆ సమయంలో స్పష్టత ఇచ్చారు.

మరో వైపు కొడాలి నాని ప్రస్తుతం జగన్ కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు. వల్లభనేని వంశీ కొడాలినాని, మరో మంత్రి పేర్నినానిలతో కలిసి ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు.

ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో ఎన్నికల ముందు జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాసరావు వైసీపీలో చేరారు. వైసీపీలో చేరిన తర్వాత నార్నే శ్రీనివాసరావు చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు.

జూనియర్ ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే కొడాలి నాని ఇప్పటికే పార్టీని వీడారు. అదే జూనియర్ ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉన్న వల్లభనేని వంశీ కూడ జగన్‌తో భేటీ కావడం .. వంశీ కూడ పార్టీ మారుతారనే ప్రచారం కావడం చర్చకు దారితీసింది. 

తనపై నమోదైన కేసు గురించి ఏపీ సీఎం వైఎస్ జగన్ తో వల్లభనేని వంశీ చర్చించినట్టుగా సమాచారం. ఒకవేళ వంశీ కూడ పార్టీ మారితే జూనియర్ ఎన్టీఆర్  సన్నిహితులంతా టీడీపీలో ఉండలేని పరిస్థితులు ఉన్నాయా అనే చర్చ తెరమీదికి వచ్చే అవకాశం లేకపోలేదు.

జూనియర్ ఎన్టీఆర్  టీడీపీకి అవసరం లేదని బాలకృష్ణ చిన్నల్లుడు ఓ ఇంటర్వ్యూలో ఇటీవల వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ ఈ వ్యాఖ్యలు ఉద్దేశ్యపూర్వకంగా చేశారా, యాధృచ్చికంగా చేశారా ఈ వ్యాఖ్యలు మాత్రం చర్చకు దారి తీశాయి.

వల్లభనేని వంశీ పార్టీ మార్పు విషయమై ఏం చెబుతారనేది  ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. వల్లభనేని వంశీ ప్రకటన కోసం టీడీపీ నేతలు కూడ ఆసక్తిగా చూస్తున్నారు. తొందరడి ఈ విషయంలో ఏ రకమైన వ్యాఖ్యలు చేయకూడదని టీడీపీ నాయకత్వం అభిప్రాయంతో ఉంది.

కొడాలి నాని, వల్లభనేని వంశీలకు  మాజీమంత్రి దేవిని ఉమ మహేశ్వరరావుకు మధ్య పొసగదు. నాని  టీడీపీలో ఉన్న సమయంలో కూడ దేవినేని ఉమ మహేశ్వరరావుతో సరైన సంబంధాలు లేవని టీడీపీ వర్గాల్లో ప్రచారంలో ఉంది. వల్లభనేని వంశీకి దేవినేని ఉమ మహేశ్వరరావుకు కూడ సంబంధాలు అంతంత మాత్రమే.