అవిశ్వాసానికి జగన్ మద్దతు: ఫిరాయింపు ఎంపీలు ఎటువైపు?

Ys Jagan supports to no trust vote
Highlights

కేంద్రంపై టీడీపీ ప్రతిపాదించిన అవిశ్వాసానానికి  వైసీపీ మద్దతు ప్రకటించింది.ఈ మేరకు వైసీపీ చీఫ్  వైఎస్ జగన్ అవిశ్వాసానికి పూర్తి మద్దతును ప్రకటిస్తున్నట్టు గురువారం నాడు ప్రకటించారు.
 


హైదరాబాద్: కేంద్రంపై టీడీపీ ప్రతిపాదించిన అవిశ్వాసానానికి  వైసీపీ మద్దతు ప్రకటించింది.ఈ మేరకు వైసీపీ చీఫ్  వైఎస్ జగన్ అవిశ్వాసానికి పూర్తి మద్దతును ప్రకటిస్తున్నట్టు గురువారం నాడు ప్రకటించారు.

కేంద్రంపై అవిశ్వాసంపై శుక్రవారం నాడు  చర్చ జరగనుంది. అయితే  ప్రస్తుతం సాంకేతికంగా  లోక్‌సభలో వైసీపీ ఎంపీలుగా  ఉన్న వారు  అవిశ్వాసంపై ఏ రకంగా స్పందిస్తారనేది ఇంకా స్పష్టం కాలేదు.

వైసీపీ ఎంపీలుగా గత ఎన్నికల సమయంలో విజయం సాధించిన  ఎస్పీవైరెడ్డి, బుట్టారేణుకలు ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్నారు.  కొత్తపల్లి గీత మాత్రం తాను ఏ పార్టీలో లేనని చెబుతున్నారు. అయితే ఆమె మాత్రం గత ఎన్నికల్లో వైసీపీ నుండి విజయం సాధించారు. కొంత కాలం పాటు ఆమె టీడీపీకి సన్నిహితంగా మెలిగారు. కానీ ఆ తర్వాత టీడీపికి కూడ దూరంగా ఉంటున్నారు.

తెలంగాణలోని ఖమ్మం నుండి వైసీపీ టిక్కెట్టు నుండి విజయం సాధించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం టీఆర్ఎస్‌లో కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో మల్కాజిగిరి ఎంపీ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా విజయం సాధించిన మల్లారెడ్డి ప్రస్తుతం టీఆర్ఎస్‌లో కొనసాగుతున్నారు. వైసీపీ ఎంపీలకు  మాత్రం ఆ పార్టీ ఎలాంటి విప్‌ జారీ చేయలేదు.

టీడీపీ మాత్రం తమ పార్టీ ఎంపీలకు విప్ జారీ చేసింది. టీడీపీ జారీ చేసిన విప్ అందిందని మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి చెప్పారు. పార్టీ విప్‌కు అనుకూలంగా ఓటు చేస్తానని ప్రకటించారు.

మరోవైపు గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధులుగా విజయం సాధించిన కొత్తపల్లి గీత, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఓటు చేస్తారనే ప్రచారం కూడ లేకపోలేదు.

ఇదిలా ఉంటే అనారోగ్యంతో ఉన్న నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డిని అవిశ్వాసం సందర్భంగా జరిగే ఓటింగ్‌కు హాజరుకావాలని టీడీపీ నాయకత్వం కోరింది.  అయితే ఈ మేరకు పార్లమెంట్‌కు హాజరుకానున్నట్టు ఎస్పీవై రెడ్డి  హమీ ఇచ్చారు.  

loader