Asianet News TeluguAsianet News Telugu

ఏం చేయాలి: ఢిల్లీ రాజకీయాలపై జగన్ వ్యూహం ఇదీ...

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మాత్రం ఢిల్లీ వైపు కన్నెత్తి చూడటం లేదు. కాదు కాదు ఢిల్లీ వైపు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఢిల్లీలో ఏం జరుగుతుందో మినిట్ మినిట్ అబ్జర్వేషన్ చేస్తున్న వైఎస్ జగన్ సమయం కోసం ఆచితూచి వ్యవహరిస్తున్నారు. 
 

YS Jagan strategy on national politics
Author
Amaravathi, First Published May 17, 2019, 3:28 PM IST

అమరావతి: జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా...?కేంద్రంలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాదని భావిస్తున్న జగన్ వ్వూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా...?

ఏపీ సీఎం చంద్రబాబునాయుడులా యూపీఏ వైపు గానీ తెలంగాణ సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ వైపు గానీ మెుగ్గు చూపకపోవడం వెనుక కారణం ఏంటి...?ఎటువైపు ఉండకుండా తటస్థంగా ఉంటేనే మంచిదని జగన్ భావిస్తున్నారా...?లేక ఢిల్లీ వెళ్లి మోకరిల్లేకన్నా ఢిల్లీ పెద్దలనే అమరావతికి రప్పించుకునే పనిలో పడ్డారా...?

ఇదే ఇప్పుడు తెలుగునాట జరుగుతున్న ఆసక్తికర రాజకీయ చర్చ. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు యూపీఏ ఫ్రంట్ లో కీలక భాగస్వామి పాత్ర పోషిస్తున్నారు. అందులో భాగంగా బీజేపీ యేతర పక్షాలను ఏకం చేసేందుకు అమరావతి టు ఢిల్లీ, ఢిల్లీ టు అమరావతి అంటూ చక్కర్లు కొడుతున్నారు. 

అటు కేసీఆర్ సైతం హైదరాబాద్ టు ఢిల్లీ, హైదరాబాద్ టు వెస్ట్ బెంగాల్, హైదరాబాద్ టు ఒరిస్సా, హైదరాబాద్ టు కేరళ, కేరళ టు తమిళనాడు ఇలా రాష్ట్రాల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. 

కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మాత్రం ఢిల్లీ వైపు కన్నెత్తి చూడటం లేదు. కాదు కాదు ఢిల్లీ వైపు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఢిల్లీలో ఏం జరుగుతుందో మినిట్ మినిట్ అబ్జర్వేషన్ చేస్తున్న వైఎస్ జగన్ సమయం కోసం ఆచితూచి వ్యవహరిస్తున్నారు. 

దేశ రాజకీయాల్లో కేంద్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించాలంటే అత్యధిక ఎంపీలు కలిగిన రాష్ట్రాలకే ప్రాధాన్యత ఉంటుంది. ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఒడిస్సా, తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యధిక ఎంపీలు కలిగి ఉన్నారు. 

ఈ రాష్ట్రాలకు చెందిన కీలక నేతలు ఆయా కూటమిలకు మద్దతుగా ఉంటే ఒడిస్సా సీఎం నవీన్ పట్నాయక్, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం సైలెంట్ గా ఉన్నారు. ఈసారి జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కనీసం 20 నుంచి 22 ఎంపీ స్థానాలు వస్తాయని పలు సర్వేలు, నేషనల్ ఛానెల్స్ వెల్లడించాయి. 

ఈ నేపథ్యంలో అటు యూపీఏ, ఎన్డీఏ లు వైఎస్ జగన్ నిర్ణయంపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. జగన్ ను ఎలా బుట్టలో వేసుకోవాలో అన్న అంశంపై తలలు పట్టుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు పీకల్లోతు కోపం ఉంది. 

తనను ఇబ్బందులకు గురి చేసిన కాంగ్రెస్ పార్టీకి ఎలా మద్దతు పలుకుతానంటూ జగన్ తన అనుచరులు వద్ద అన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం గమనించిన కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్ కు కాంగ్రెస్ పార్టీతో సంబంధాలు ఉన్న పెద్దలను దూతలుగా పంపేందుకు సిద్ధంగా ఉంది. 

వైఎస్ జగన్ మద్దతు కోసం యూపీఏ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ లేదా మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ లను జగన్ తో చర్చించేందుకు రంగంలోకి దింపే యోచనలో ఉన్నాయి. అటు బీజేపీ నుంచి అమిత్ షా, మోదీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ టూ అంటూ ప్రచారం జరుగుతున్న విజయసాయిరెడ్డితో టచ్ లో ఉన్నారు.

 గత ఎన్నికల్లో ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఇవ్వకుండా మోసం చేసిన బీజేపీని అంత ఈజీగా జగన్ నమ్మడం లేదట. అలాగే రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా అనే అంశాన్ని చట్టం చేయకుండా తప్పించుకోవడంపై కూడా ఆగ్రహంతో రగిలిపోతున్నారట. 

ప్రత్యేక హోదా అంశాన్ని తేల్చితేనే ఆ పార్టీకి మద్దతు పలకాలని జగన్ నిర్ణయించుకున్నారట. ఇకపోతే వైఎస్ జగన్ పట్టువదలని విక్రమార్కుడంటూ ఏపీ రాజకీయాల్లో టాక్. తనతో దూతలు కాకుండా నేరుగా సోనియాగాంధీ మాట్లాడితేనే చూద్దాం అంటూ జగన్ చెప్పుకొస్తున్నారట. 

దీంతో సోనియాగాంధీ లేదా రాహుల్ గాంధీలు తగ్గి జగన్ వైపు దిగిరావాల్సిందేనని వార్తలు వస్తున్నాయి. యూపీఏ ఫ్రంట్ అంటూ చంద్రబాబు, ఫెడరల్ ఫ్రంట్ అంటూ కేసీఆర్ లు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతుంటే జగన్ మాత్రం ఢిల్లీనే అమరావతికి రప్పించే ప్రయత్నాల్లో ఉన్నారట. 

తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టడం కాదని ఢిల్లీనే రాష్ట్రంవైపు చూసేలా చేస్తేనే తెలుగు వాడి ఆత్మగౌరవం పెరుగుతుందని అది జగన్ వల్లే సాధ్యమంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. 

చంద్రబాబు ఢిల్లీలో మోకరిల్లుతుంటే ఢిల్లీ పెద్దల చూపు ఏపీవైపు పడేలా చేస్తున్న వైఎస్ జగన్ అసలైన తెలుగోడు అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. మెుత్తానికి జాతీయ రాజకీయాలు జగన్ ను తెలుగోడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన వ్యక్తిగా మార్చబోతున్నాయంటూ వార్తలు వినబడుతున్నాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios