హైదరాబాద్: రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న నేపథ్యంలో వైసీపీలో ముసలం మెుదలయ్యింది. రాజంపేట సీటు పంచాయితీ మెుదలైంది. ఆ సీటింగ్ పై ఆశలు పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే అమర్ నాథ్ రెడ్డి అలకబూనినట్లు తెలుస్తోంది. 

గతంలో కాంగ్రెస్ పార్టీ తరుపున ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి  సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన మేడా మల్లికార్జునరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఇకపోతే మేడా మల్లికార్జునరెడ్డి వైసీపీలో చేరిక లాంఛనమైన నేపథ్యంలో అమర్ నాథ్ రెడ్డితో ఆయన అనుచరులు పార్టీ కార్యకర్తలు సమావేశమయ్యారు. 
టిక్కెట్ అంశంపై చర్చించారు. వైఎస్ జగన్ వద్దే తేల్చుకోవాలని కార్యకర్తలు ఒత్తిడి తెచ్చారు. ఈ విషయాన్ని గ్రహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అలర్ట్ అయ్యింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ అమర్ నాథ్ రెడ్డికి ఫోన్ చేసి తనను కలవాల్సిందిగా ఆదేశించారు. 

దీంతో అమర్ నాథ్ రెడ్డి జిల్లాకు చెందిన రాజంపేట మాజీ ఎంపీ మిథున్ రెడ్డి, కడప మాజీఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాసులు, శ్రీకాంత్ రెడ్డిలతో కలిసి లోటస్ పాండ్ లోని జగన్ ను ఆయన నివాసంలో కలుసుకున్నారు. దాదాపు మూడుగంటలకు పైగా వీరు రాజంపేట నియోజకవర్గంపైనా ఇతర రాజకీయ అంశాలపైనా చర్చించారు. 

ఈ సమావేశంలో మేడా మల్లికార్జునరెడ్డి వైసీపీలో చేరబోతున్నారని ఇక చేరినట్లేనని అయితే ఆయన్ను కలుపుకుపోవాలని నేతలకు సూచించారు. సమావేశం అనంతరం అమర్ నాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మేడా మల్లికార్జునరెడ్డి పార్టీలో చేరడం వల్ల పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు. 

అయితే రాజంపేట టిక్కెట్ విషయాన్ని ఇంకా ఎవరికి అనేది నిర్ణయించలేదని స్పష్టం చేశారు. రాజంపేట టిక్కెట్ విషయంలో అధిష్టానం నిర్ణయమే తన నిర్ణయమన్నారు. తాను మేడా మల్లికార్జునరెడ్డి కోసం కాదని జగన్ కోసం పని చేస్తానని చెప్పుకొచ్చారు. పార్టీ వ్యవస్థాపకుల్లో తాను ఒకరినని పార్టీ నిర్ణయమే తన నిర్ణయమని చెప్పుకొచ్చారు. 

ఇకపోతే రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం సీటు మేడా మల్లికార్జునరెడ్డి లేదా అతని సోదరుడికి ఇస్తారంటూ ప్రచారం జరుగుతుంది. ఈ వార్తల నేపథ్యంలో వైసీపీలో రాజంపేట నియోజకవర్గం సీటు చిచ్చు నెలకొంది. ఈ వివాదం ముందుముందు ఇంకెలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో అన్నది వేచి చూడాలి.