Asianet News TeluguAsianet News Telugu

సైకిల్‌ను చంద్రబాబు తొక్కలేకపోతున్నారు.. మొరిగినంత మాత్రానా గ్రామ సింహాలు.. సింహాలు కాలేవు: జగన్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సీఎం వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా ఫ్యాన్ గిర్రున తిరిగిందన్నారు. చంద్రబాబు సైకిల్ టైర్లు ఊడిపోయాయని ఎద్దేవా చేశారు. 

YS jagan Slams chandrababu Naidu At YSRCP Plenary
Author
First Published Jul 9, 2022, 4:08 PM IST

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సీఎం వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ఎక్కడ కూడా అన్యాయం జరిగిందనే మాట రాకుండా.. అందరికీ న్యాయం చేయడానికే మూడు రాజధానులని చెప్పారు. చంద్రబాబు, టీడీపీ నేతలు వారి బినామీ భూములు కోసం మూడు రాజధానులకు అడ్డుపడుతున్నారని విమర్శించారు. రియల్ ఎస్టేట్ కోసమే చంద్రబాబు అమరావతి అంటున్నారని ఆరోపించారు. 

‘‘రాష్ట్రంలో 75 ఏళ్లలో రెండు జిల్లాలు అదనంగా ఏర్పడితే.. మన ప్రభుత్వం వచ్చాక కొత్తగా 13 జిల్లాలు ఏర్పాటు చేశాం. అందులో ఒక్క జిల్లాకు రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ పేరు పెట్టాం. అయితే అంబేడ్కర్ పేరు పెట్టినందుకే.. ఒక్క ఎస్సీ మంత్రి ఇంటిని, బీసీ ఎమ్మెల్యే ఇంటిని తగలపెట్టేలా చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు చేశారు. వీళ్లు మనుషులేనా.. న్యాయమేనా అని ప్రజలు ఆలోచించాలి

అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చాం. అందరికీ మేలు చేశాం కాబట్టే అన్ని ఎన్నికల్లో విజయం సాధించాం. ఏ ఎన్నికలు జరిగినా ఫ్యాన్ గిర్రున తిరిగింది. చంద్రబాబు సైకిల్ టైర్లు ఊడిపోయాయి. దానిని ఆయన తొక్కలేక, కొడుకుతో తొక్కించలేక.. దత్తపుత్రుడి సాయం కోరుతున్నాడు. ఎల్లో మీడియా చూపినంతా మాత్రాన అబద్దాలు నిజాలు కావు. గట్టిగా మొరిగినంత మాత్రన గ్రామ సింహాలు.. సింహాలు కాలేవు. మనం చేస్తున్న మంచిని చూసి తట్టుకోలేక గ్రామ సింహాలు రోజు అరుస్తూ ఉన్నాయి. 

Also Read: చంద్రబాబులా కాకుండా ఈ మూడేళ్లు ప్రజలకు మంచి చేయాలనే ఆలోచించాను: వైఎస్ జగన్

మనం ప్రజలకు మంచి చేస్తుంటే వాళ్ల బాబుకు డిపాజిట్‌లు దక్కవనే దురుద్దేశంతో రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని అరుస్తున్నారు. జగన్ కంటే చంద్రబాబు  ఎక్కువ అప్పులు చేశాడు. చంద్రబాబు హయాంలో రాష్ట్రం ఏమైనా అమెరికా అయిందా?. సంక్షేమ పథకాలు ఆపేయాలన్నదే దుష్టచతుష్టయం కుట్ర. ఈ దొంగల ముఠాతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. చంద్రబాబుకు ఓటేస్తే.. సంక్షేమానికి వ్యతిరేకంగా ఓటు వేసినట్టేనని చెప్పండి. ఓట్ల కోసం చంద్రబాబు తప్పుడు వాగ్దానాలతో మీ ముందుకు వస్తారు. ఈనాడు, ఆంధ్రజ్యోగి, టీవీ5, దత్తపుత్రుడు మనకు లేడు.. అసత్యాలు చెప్పడం, వెన్నుపోట్లు పోడవడం మనకు రాదు. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది దుష్టచతుష్టయం విష ప్రచారం ఎక్కువ అవుతుంది. దేవుడు దయతో 2024లో 175 స్థానాలతో తిరిగి వస్తాం. నాకు ఉన్న గుండె ధైర్యం మీరే. కౌరవుల సైన్యాన్ని ఓడించడంలో అర్జునుడి పాత్ర మీదే. ఈ పార్టీ మీది. జగన్.. మీ అన్న, తమ్ముడు. ప్రతి వైఎస్సార్ కార్యకర్త కూడా నావాడు. రాష్ట్ర భవిష్యత్తుకు, మీ భవిష్యత్తుకు నాది బాధ్యత’’ అని జగన్ చెప్పారు. 

మేనిఫెస్టోలో చెప్పింది చేశానని నమ్మితేనే ఓటు వేయండి..
మేనిఫెస్టోలో చెప్పింది చేశానని నమ్మితేనే వచ్చే ఎన్నికల్లో ఓటు వేయాలని సీఎం జగన్ అన్నారు. మూడేళ్లలో 95 శాతం హామీలను అమలు చేశామని చెప్పారు. ఒక విద్యా రంగంలోనే తొమ్మిది పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. అమ్మఒడి ద్వారానే ఇప్పటివరకు రూ. 19,617 కోట్లు ఇచ్చామని తెలిపారు. ఎక్కడ ఎలాంటి వివక్ష లేకుండా డీబీటీ ద్వారా నగదు జమ చేస్తున్నామని పేర్కొన్నారు. నాడు-నేడు ద్వారా స్కూళ్ల రూపు రేఖలను మార్చుతున్నామని తెలిపారు. ప్రభుత్వ బడుల్లో మౌలిక సదుపాయాల కోసం రూ. 16, 352 కోట్లు ఇచ్చామని చెప్పారు. ఈ మూడేళ్లలో విద్య కోసమే రూ. 52 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. 

Also Read: చిప్ చేతి రింగ్‌లోనో, అరికాళ్ళలోనో ఉంటే సరిపోదు.. : చంద్రబాబు డిజిటల్ రింగ్‌పై జగన్ సెటైర్లు..

చంద్రబాబు హయాంలో ఆరోగ్య శ్రీని నీరుగార్చరని విమర్శించారు. 108, 104 వాహనాలను కూడా ఆనాడు పట్టించుకోలేదని మండిపడ్డారు. వైసీపీ అధికారంలో వచ్చాక నాడు-నేడుతో ఆస్పత్రుల రూపు రేఖలు మార్చామని చెప్పారు. ఆరోగ్య శ్రీ పరిధి 2,466 రోగాలకు పెంచామని తెలిపారు. మండలానికి రెండు పీహెచ్‌సీలు, గ్రామానికి ఒక విలేజ్ క్లీనిక్ తీసుకొస్తున్నామని చెప్పారు.  

‘‘రైతులను గుండెల్లో పెట్టుకున్న ప్రభుత్వం మనది. ఆర్‌బీకేల ద్వారా రైతులను చేయి పట్టుకుని నడిపిస్తున్నాం. మూడేళ్లలో వ్యవసాయ రంగంపై రూ. లక్షా 27 వేల కోట్లు ఖర్చుచేశాం. మూడేళ్లలో ఒక్క రైతు భరోసా ద్వారానే రూ. 23,875 కోట్లు ఇచ్చాం. సుమారు 50 లక్షల రైతు కుటంబాలకు మేలు జరిగింది. ధాన్యం కొనుగోళ్లు కోసం రూ. 45 వేల కోట్లు ఖర్చు చేశాం. ఉచిత విద్యుత్‌ కోసం రూ. 27వేల కోట్లు ఖర్చు చేశాం. వైఎస్సార్‌ ఆసరా ద్వారా అక్కా చెల్లెమ్మలకు రూ. 12, 758 కోట్లు ఇచ్చాం. వైఎస్‌ఆర్‌ చేయూత ద్వారా అక్కా చెల్లెమ్మలకు రూ. 9,180 కోట్లు ఇచ్చాం. అక్కా చెల్లెమ్మల పేరుపైనే ఇళ్ల రిజిస్ట్రేషన్‌ చేస్తున్నాం. ఇప్పటివరకూ 31లక్షలకు పైగా ఇళ్ల పట్టాలు అందజేశాం’’ అని జగన్ చెప్పారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios