కుప్పం ప్రజలు కూడా చంద్రబాబు మావాడు అని చెప్పుకునే పరిస్థితి లేదు: వైఎస్ జగన్

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి విమర్శలు గుప్పించారు. రాజధాని నుంచి స్కిల్ డెవలప్‌మెంట్ వరకు అన్నింట్లో చంద్రబాబు దోచుకున్నారని ఆరోపించారు.

YS Jagan Slams Chandrababu At Yemmiganur Public Meeting ksm

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి విమర్శలు గుప్పించారు. రాజధాని నుంచి స్కిల్ డెవలప్‌మెంట్ వరకు అన్నింట్లో చంద్రబాబు దోచుకున్నారని ఆరోపించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జగనన్న చేదోడు సాయం నిధులను విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3,25,020 మంది లబ్దిదారుల ఖాతాల్లో రూ. 325.02 కోట్ల ఆర్థిక సాయాన్ని బటన్ నొక్కి జమచేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుని, వెనకబడిన వర్గాల జీవన ప్రయాణంలో తోడుగా ఉన్నామని చెప్పారు. వరుసగా నాలుగో ఏడాది జగనన్న చేదోడు అందజేస్తున్నామని తెలిపారు. 

ఎక్కడా అవినీతికి, వివక్షకు తావులేకుండా లబ్దిదారులకు నేరుగా నగదు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. అప్పుడు అదే రాష్ట్రం.. అదే బడ్జెట్ అని అన్నారు. కానీ అప్పట్లో గజ దొంగల ముఠా రాష్ట్రాన్ని దోచుకుందని విమర్శించారు. అప్పుడు రాష్ట్రం ఎందుకు అభివృద్ది జరగలేదో ప్రజలు ఒకసారి ఆలోచించాలని కోరారు. 

కుప్పం ప్రజలు కూడా చంద్రబాబు మావాడు అని చెప్పుకునే పరిస్థితి లేదని విమర్శించారు. చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి కూడా.. కుప్పంలో పేదవాడికి ఇంటి స్థలం ఇవ్వలేకపోయాడని ఆరోపించారు. కుప్పంలో తమ ప్రభుత్వం 20 వేల ఇంటి స్థలాలు ఇవ్వడం జరిగిందని.. 8 వేల ఇంటి స్థలాల్లో ఇళ్లు కట్టించడం జరుగుతుందని చెప్పారు. 

గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక.. టీడీపీ మేనిఫెస్టోను చెత్త బుట్టలో వేశారని విమర్శించారు. చంద్రబాబు పాలనలో సున్నా వడ్డీని కూడా ఎత్తివేశారని విమర్వించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాకరుణమాఫీ హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు. పొదుపు సంఘాలను చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. చంద్రబాబు హయంలో పొదుపు సంఘాలు విలవిలలాడిపోయాయని విమర్శించారు. చంద్రబాబు గతంలో జాబు రావాలంటే.. బాబు రావాలని అన్నారని ఎద్దేవా చేశారు. జాబ్ ఇవ్వకుంటే రూ. 2 వేలు ఇస్తానని ప్రచారం చేశారని.. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక పిల్లలను కూడా మోసం చేశారని విమర్శించారు.

తమ ప్రభుత్వం 2019 మేనిఫెస్టోలో చెప్పిన మాటకు మిన్నగా రైతులకు మేలు చేశామని చెప్పారు. మేనిఫెస్టోలో చెప్పిన 99 శాతం హామీలను పూర్తి చేశామని తెలిపారు. ఆ మేనిఫెస్టోతో చేసిన పనులు చెప్పుకుని ప్రజల ఆశీస్సులు తీసుకుంటున్నామని చెప్పారు. 2.38 లక్షల కోట్ల రూపాయలు బటన్ నొక్కి నేరుగా అక్కాచెల్లమ్మల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత వివిధ పథకాలతో పొదుపు సంఘాలకు అండగా నిలబడ్డామని చెప్పారు. 31 లక్షల ఇంటిపట్టాలు అక్కాచెల్లమ్మలకు ఇవ్వడం జరిగిందని చెప్పారు. 

రాష్ట్రంలో మొత్తం 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటే.. తన నాలుగేళ్ల పాలనలో ఏకంగా మరో 2 లక్షల 7 వేల ఉద్యోగాలను యాడ్  చేసినట్టుగా చెప్పారు. అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే 80 శాతం ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. గతంలో ఏ పౌర సేవలు కావాలన్న జన్మభూమి కమిటీల చుట్టూ లంచాలు ఇచ్చుకుంటూ తిరిగాల్సి ఉండేదని అన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్పారు. రాష్ట్రంలో 18 మెడికల్ కాలేజ్‌లు కడుతున్నామని తెలిపారు. 

చంద్రబాబు హయంలో ఆరోగ్యశ్రీని వదిలించుకునే ప్రయత్నాలు చేశారని.. కానీ ఇప్పుడు ఆరోగ్యశ్రీని విస్తరించి పేదలకు అండగా నిలిచామని చెప్పారు. నాడు-నేడుతో స్కూళ్ల రూపురేఖలను మారుస్తున్నామని తెలిపారు. జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా అందరికీ ఉచిత వైద్య సేవలను అందిస్తున్నామని చెప్పారు. చంద్రబాబు ఎస్సీలు, బీసీలు, మహిళలను అవమానించేలా మాట్లాడారని విమర్శించారు. 

చంద్రబాబు  హయంలో పేదవాళ్లకు సెంటు భూమి ఇచ్చిన పాపన పోలేదని విమర్శించారు. చంద్రబాబు పేరు పెట్టుకున్న రాజధాని ప్రాంతంలో పేదవారికి ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా కోర్టులకు వెళ్లి కేసులు వేశారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం పేదవాడికి తోడుగా తామున్నమని ప్రతి అడుగులో భరోసా ఇస్తున్నామని చెప్పారు. రాబోయేది కురుక్షేత్ర సంగ్రామం అని.. పేదవాడికి, పెత్తందార్లకు మధ్య యుద్దం జరుగబోతుందని అన్నారు. చంద్రబాబు మాదిరిగా.. తనకు టీవీ చానళ్ల సపోర్టు లేదని, దత్తపుత్రుడి అండ, తోడు లేదని అన్నారు. రేపు జరిగే యుద్దంలో తోడేళ్లన్నీ ఏకం అవుతాయని.. తాను నమ్ముకున్నది దేవుడిని, ప్రజల ఆశీస్సులను మాత్రమేనని చెప్పారు. ‘‘మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మంచి జరిగిందా? లేదా? అనేది కొలమానంగా తీసుకోండి.. మీ ఇంట్లో మంచి జరిగితే మీ బిడ్డకు సైనికుడిగా నిలబడండి’’ అని జగన్ కోరారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios