వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కూటమి ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆరోపణలు చేశారు. మీడియాతో మాట్లాడిన జగన్ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ప్రస్తావించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
వైసీపీ హయాంలో రైతులను ఆదుకోవడమే ప్రధాన కర్తవ్యంగా పనిచేశామని జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ధరల స్థిరీకరణ నిధికి ₹7,800 కోట్లు కేటాయించామని, మార్కెట్లో పోటీ పెంచి పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించామని గుర్తు చేశారు. ప్రతి ఆర్బీకేలో ఈ-క్రాపింగ్ నిర్వహించి రైతులకు సకాలంలో సహాయం అందించామని చెప్పారు.
ఉల్లిపాయ ధరలు స్థిరంగా ఉండేలా చర్యలు తీసుకున్నామని, రైతు భరోసా, కోవిడ్ సమయంలోనూ ఆర్థిక సాయం అందించామని వివరించారు. ఇక ప్రస్తుత పాలనలో మాత్రం ఆర్బీకేలను నిర్వీర్యం చేసి, సున్నావడ్డీ రుణ పథకాన్ని నిలిపివేసి, సహాయం పొందే రైతుల సంఖ్యను తగ్గించారని ఆరోపించారు.
ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేయడం వల్లే రైతులు అగచాట్లు పడుతున్నారని జగన్ ఆరోపించారు. రైతులకు రావాల్సిన ఎరువులు టీడీపీ నాయకుల చేతుల్లో బ్లాక్‌మార్కెట్‌లోకి వెళ్తున్నాయని, అధిక ధరలకు అమ్మకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. యూరియా పంపిణీలోనే ₹250 కోట్ల భారీ స్కాం జరిగిందని అన్నారు.
సీఎం స్వస్థలంలో కూడా రైతులు క్యూలైన్లలో నిలబడి ఎరువుల కోసం పోరాడుతున్నారంటే, ఇది ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. రైతుల సమస్యలను ఎత్తిచూపేందుకు వైఎస్సార్‌సీపీ నాయకులు ఆర్డీవోలకు అర్జీలు ఇచ్చారని, అయితే ఆ కార్యక్రమాలను పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు. రైతులకు మద్దతుగా నిలబడ్డ తమ నేతలకు నోటీసులు ఇవ్వడం అన్యాయం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
"రైతుల పక్షాన నిలబడటం తప్పా చంద్రబాబూ?" అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో ప్రతి రంగంలోనూ అవినీతి, దోపిడీ విస్తరించిందని జగన్ అన్నారు. తన హయాంలో అధికారులను కట్టడి చేసి దోపిడీకి అవకాశం ఇవ్వలేదని గుర్తు చేశారు. ఇప్పుడు మాత్రం పై నుంచి కింద వరకు "దోచుకో.. పంచుకో" అన్న తీరులో వ్యవస్థ నడుస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం అసలు పనిచేస్తుందా అన్న సందేహం వస్తోందని జగన్ అన్నారు.
రెండు నెలలుగా రైతులు ఎరువుల కోసం అగచాట్లు పడుతున్నారని, ఇది నిర్లక్ష్య పాలన ఫలితమని అన్నారు.
కనీస బాధ్యతలు నిర్వర్తించని కూటమి ప్రభుత్వం "సూపర్ సిక్స్" పేరుతో ప్రజలకు అన్యాయం చేస్తోందని తీవ్ర విమర్శలు గుప్పించారు.
