2014-15 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ స్థానిక ఎన్నికలు నిర్వహించకుండానే ముందుకు వెళ్లిందన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఇవాళ అధికారంలోకి వచ్చిన వైసీపీ అయితే ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు.

ఎన్నికలే వద్దన్నట్లుగా టీడీపీ దాటవేస్తే.. వైసీపీ దౌర్జన్యంగా దాటవేస్తోందని పవన్ ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం పట్ల గౌరవం లేదని, నేరచరిత్ర ఉన్న నాయకులను పక్కనబెట్టాలని పవన్ కోరారు.

Also Read:నేడు జగన్‌తో భేటీ కానున్న కరణం బలరాం: వైసీపీలోకి కరణం కుటుంబం

స్థానిక ఎన్నికల్లో యువతకు, స్థానికులకు పెద్ద పీట వేయాలని బీజేపీ, జనసేన అవకాశాలు ఇస్తుంటే వారికి నామినేషన్ వేయకుండా వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారని పవన్ కల్యాణ్ ఆరోపించారు.

నెల్లూరు జిల్లా వెంకటాచలంలో మణెమ్మ అనే ఎంపీటీసీ అభ్యర్ధిపై దాడి చేశారని, అనంతపురం జిల్లాతో పాటు గురువారం శ్రీకాళహస్తిలోనూ దాడులకు పాల్పడ్డారని ఆయన ధ్వజమెత్తారు.

151 మంది ఎమ్మెల్యేల బలం ఉన్నప్పటికీ వైసీపీ ఎందుకు భయపడుతోంద తనకు అర్ధం కావడం లేదన్న పవన్ జనాన్ని భయపెట్టే ఉద్దేశ్యం ఉంటే ఎన్నికలు ఎందుకుని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోకపోవడం దారుణమని జనసేనాని వ్యాఖ్యానించారు.

కొంతమంది పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా ప్రవర్తిస్తున్నారని, ఈ విషయాన్ని డీజీపీ దృష్టికి తీసుకెళ్తామని పవన్ స్పష్టం చేశారు. భయపెట్టి సాధించిన గెలుపు నిలబడదన్నారు. నామినేషన్లు వేసిన అభ్యర్ధులు ఎన్నికల్లో ధైర్యంగా పోటీ చేయాలని బలంగా నిలబడాలని పవన్ పిలుపునిచ్చారు.

Also Read:17 మంది టీడీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో: సజ్జల రామకృష్ణారెడ్డి సంచలనం

వైసీపీ రౌడీయిజానికి ముక్కుతాడు వేయాల్సిన సమయం ఆసన్నమైందని అది ఎంత త్వరగా జరుగుతుందా అని తాము కూడా ఎదురుచూస్తున్నామని పవన్ తెలిపారు. నామినేషన్ల ప్రక్రియకే ఇంత జరుగుతుంటే.. రేపు ఓట్లు వేసేందుకు ఎవరు వస్తారని జనసేనాని ప్రశ్నించారు.

ఏకగ్రీవం చేయడానికి ఎన్నికలు ఎందుకని , జగనే స్వయంగా అభ్యర్ధులను ప్రకటించుకోవచ్చు కదా అని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీ మరో బీహార్‌లా మారుతుందని ఢిల్లీలో కొందరు జర్నలిస్టులు అంటున్నారని పవన్ గుర్తుచేశారు. గోదావరి జిల్లాల్లో సైతం ఏకగ్రీవం చేయాలని లేదంటే పొలాలను బలవంతంగా లాక్కుంటామని బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు.