Asianet News TeluguAsianet News Telugu

కాపు కోటపై ఎజెండా సెట్ చేసిన జగన్: అనివార్యతలో పవన్, బాబు

బహుశా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తొలిసారి వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎజెండా సెట్ చేశారు. కాపు రిజర్వేషన్లపై స్పష్టమైన ప్రకటన చేయడం ద్వారా ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఎజెండా ఇచ్చారు.

YS Jagan set agenda for Chandrababu and Pawan Kalyan

అమరావతి: బహుశా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తొలిసారి వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎజెండా సెట్ చేశారు. కాపు రిజర్వేషన్లపై స్పష్టమైన ప్రకటన చేయడం ద్వారా ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఎజెండా ఇచ్చారు.

ప్రత్యేక హోదాపై, విభజన హామీలపైనే కాకుండా అవినీతి ఆరోపణలతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కిన వేళ జగన్ అందరి దృష్టిని కాపు కోటాపైకి మళ్లించారు. తాను అధికారంలోకి వస్తే కాపు రిజర్వేషన్లను అమలు చేయలేనని, అది తన చేతుల్లో ఉండదు కాబట్టి అమలు చేయలేనని, అందువల్ల ఆ హామీని ఇవ్వలేనని ఆయన చెప్పారు. 

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తనపై భగ్గుమన్నప్పటికీ, కాపు కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నప్పటికీ జగన్ వెనక్కి తగ్గలేదు. కాపులను బుజ్జగిస్తే తప్ప అధికారంలోకి రాలేమనే అభిప్రాయం బలంగా ఉన్న స్థితిలో ఆయన ఆ ప్రకటన చేయడం ఒక రకంగా సాహసోపేతమైందే. 

జగన్ ప్రకటనపై చంద్రబాబుతో పాటు తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్ యూటర్న్ తీసుకున్నారని ఆరోపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలమైన కాపు సామాజిక వర్గాన్ని, జయాపజయాలను నిర్ణయించకలిగే శక్తి ఉన్న కాపులను జగన్ కు దూరం చేయాలనేది చంద్రబాబు వ్యూహంగా కనిపిస్తోంది. కానీ, కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపి, రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ లో చేర్చాలని కోరిన తర్వాత తన పని అయిపోయిందని చంద్రబాబు అనుకున్నారు.

కాపు రిజర్వేషన్ల విషయంలో తాను చిత్తశుద్ధి ప్రదర్శించానని, కేంద్రమే అందుకు ముందుకు రావడం లేదని ఆయన చెప్పదలుచుకున్నారు. అదే చెబుతున్నారు కూడా. రిజర్వేషన్లు మొత్తం యాభై శాతానికి మించకూడదనే సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత, కేంద్రం తాము అదనపు రిజర్వేషన్లకు అనుకూలం కాదని తెగేసి చెప్పిన తర్వాత కాపు రిజర్వేషన్లు అమలవుతాయని అనుకోవడం భ్రమే అవుతుందని అంటున్నారు. అందువల్ల జగన్ ప్రకటన చంద్రబాబును ఇప్పుడు ఏదో మేరకు చిక్కుల్లో పడేసినట్లే. అదే సమయంలో కేంద్రంపై ఒత్తిడి తేవడానికి ఆయన కార్యక్రమం తీసుకోవాల్సిన అనివార్యతలో పడ్డారు.

ఇదిలావుంటే, కాపు సామాజిక వర్గం నేతగా తనపై ముద్రపడకుండా జనసేన అధినేత పవన్ కల్యాణ్ జాగ్రత్త పడుతూ వస్తున్నాడు. తాను అన్ని వర్గాలకు చెందినవాడినని చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు ఆయన కాపు రిజర్వేషన్లపై స్పష్టమైన వైఖరిని ప్రదర్శించాల్సిన అగత్యంలో పడ్డారు. దాంతో ఆయన నిపుణులతో చర్చలకు పూనుకున్నారు. కాపు రిజర్వేషన్లకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే, మిగతా వర్గాలు పవన్ కల్యాణ్ కు దూరమయ్య ప్రమాదం ఉందా అనేది కూడా ఆలోచించాల్సిన విషయమే. వ్యతిరేకంగా తీసుకుంటే తనపై ఆశలు పెట్టుకున్న కాపు సామాజిక వర్గం ఎలా ప్రతిస్పందిస్తుందనేది తెలియదు. అందువల్ల పవన్ కల్యాణ్ చిక్కుల్లో పడినట్లే చెప్పవచ్చు. జగన్ ఆ ప్రకటన చేయడం వెనక చంద్రబాబును కన్నా పవన్ కల్యాణ్ నే ఎక్కువగా దృష్టిపెట్టుకున్నట్లు కనిపిస్తున్నారు. 

వచ్చే ఎన్నిక్లలో త్రిముఖ పోటీ ఉండే అవకాశాలున్న నేపథ్యంలో ఏదో మేరకు పవన్ కల్యాణ్ ను బలహీనపరచడం ద్వారా తాను ఆధిక్యంలోకి రావాలని జగన్ అనుకుంటూ ఉండవచ్చు. పైగా, కాపు రిజర్వేషన్లపై ప్రకటన ద్వారా బలమైన బీసీలు తన వైపు మళ్లుతారని జగన్ భావిస్తున్నట్లున్నారు. కాపు రిజర్వేషన్లకు అనుకూలంగా పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకుంటే, బీసీలు ఆయనకు వ్యతిరేకమయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు. మొత్తం మీద, బహుశా తొలిసారి జగన్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇతర పార్టీలకు ఎజెండాను ఇచ్చారు. 

Follow Us:
Download App:
  • android
  • ios